బ్యాటింగ్‌ పిచ్‌ సిద్ధం!

Batting pitch is ready!– రెండో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలం
– ముంబయి వాంఖడె పిచ్‌పై ఫోకస్‌
భారత్‌, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ఎవరూ ఊహించని మలుపు తీసుకుంది. బెంగళూర్‌లో పేస్‌, పుణెలో స్పిన్‌ మ్యాజిక్‌తో న్యూజిలాండ్‌ మెరుపు విజయాలు నమోదు చేసింది. 2-0తో టెస్టు సిరీస్‌ విజయాన్ని లాంఛనం చేసుకుంది. సిరీస్‌ ఫలితం తేలినా.. ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల వేటలో ముంబయిలో జరుగనున్న మూడో టెస్టుపై ఆసక్తి ఏమాత్రం సన్నగిల్లలేదు. నవంబర్‌ 1 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుండగా.. క్రికెటర్లు, అభిమానుల ఫోకస్‌ వాంఖడె పిచ్‌పై నెలకొంది.
నవతెలంగాణ-ముంబయి
భారత్‌, న్యూజిలాండ్‌ మూడో టెస్టు మ్యాచ్‌ నవంబర్‌ 1 నుంచి ముంబయిలో జరుగనుంది. ఇరు జట్లు ఇప్పటికే దేశ ఆర్థిక రాజధానికి చేరుకున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఓటమితో సిరీస్‌పై టీమ్‌ ఇండియా ఆశలు గల్లంతు కాగా.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ఆఖరు టెస్టులో విజయం భారత జట్టుకు ఇప్పుడు అవసరం. టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌లో ఎన్నడూ ఐదు రోజుల ఫార్మాట్‌లో సిరీస్‌ విజయం సాధించని న్యూజిలాండ్‌ 2024లో ఆ ఘనత దక్కించుకుంది. సిరీస్‌ విజయం దక్కటంతో ఇప్పుడు కివీస్‌ దష్టి క్లీన్‌స్వీప్‌పైకి మళ్లగా.. భారత్‌ వైట్‌వాష్‌ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమైంది.
బ్యాటింగ్‌కు అనుకూలం!
బెంగళూర్‌లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారగా.. పుణెలో స్పిన్‌ వ్యూహమే బెడిసికొట్టింది. ప్రత్యర్థి కోసం స్పిన్‌ వల వేయగా.. అందులో టీమ్‌ ఇండియానే చిక్కుకుని విలవిల్లాడింది. దీంతో వాంఖడెలో పిచ్‌ ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. ముంబయిలో సాధారణంగా ఎర్రమట్టి పిచ్‌లనే వాడతారు. ఇక్కడ నల్లమట్టితో చేసిన పిచ్‌లు అందుబాటులో లేవు. ఎర్రమట్టి పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు సహా పేసర్లకు అనుకూలం. పిచ్‌పై పచ్చికను ఉంచితే పేసర్లు చెలరేగేందుకు వీలుంటుంది. పిచ్‌పై పచ్చిక తొలగిస్తే బ్యాటర్లు పరుగుల వరద పారిస్తారు. దీంతో వాంఖడే పిచ్‌ రూపకల్పనపై మూడో టెస్టు ముంగిట ఆసక్తి ఉంది. అయితే, తొలి రోజు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ను తయారు చేస్తున్నట్టు వాంఖడె వర్గాలు చెబుతు న్నాయి. పుణెలో తొలి సెషన్లోనే స్పిన్నర్లు వికెట్ల వేట మొదలెట్టగా.. చిన్నస్వామిలో పేసర్లు నిప్పులు చెరిగారు. ఆ రెండు పిచ్‌లకు భిన్నంగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎర్రమట్టి పిచ్‌ కావటంతో పేసర్లకూ, స్పిన్నర్లకు ఆఖరు వరకు పిచ్‌ నుంచి సహకారం ఉండనుంది. ఎండ మరీ ఎక్కువగా ఉంటే మూడో రోజు నుంచి టర్న్‌ను కాచుకోవటం కత్తిమీద సాము కానుంది. ‘వాంఖడెలో స్పోర్టింగ్‌ పిచ్‌ ఉండనుంది. ప్రస్తుతానికి పిచ్‌పై పచ్చిక ఉంది. తొలి రోజు బ్యాటింగ్‌కు అనుకూలమని చెప్ప వచ్చు. రెండో రోజు నుంచి స్పిన్‌కు పిచ్‌ సహకరించనుంది’ అని వాంఖడె వర్గాలు తెలిపాయి.
వైట్‌వాష్‌ ప్రమాదం
ముంబయిలో భారత్‌కు మరో సవాల్‌ ఎదురు కానుంది. తొలి రెండు టెస్టుల్లో ఓడిన రోహిత్‌సేన ఇప్పుడు వైట్‌వాష్‌ ప్రమాదంలో పడింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఇప్పటివరకు 12 టెస్టు సిరీస్‌లలో పోటీపడిన భారత్‌ రెండింటిని డ్రా చేసుకోగా.. పది సిరీస్‌లలో విజయాలు సాధించింది. 1969లో రెండు మ్యాచుల సిరీస్‌ 1-1తో సమం కాగా.. 2003-04 సిరీస్‌ 0-0తో సమమైంది. నిజానికి గతంలో భారత్‌పై రెండు టెస్టుల్లోనే కివీస్‌ గెలుపొందింది. 1969 నాగ్‌పూర్‌, 1988 ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ఆ తర్వాత మొన్న బెంగళూర్‌లో సాధించిన విజయమే. 1933-34లో భారత్‌లో జరిగిన తొలి టెస్టు సిరీస్‌ను 0-2తో ఇంగ్లాండ్‌కు కోల్పోయిన భారత్‌.. ఆ తర్వాత 1999-2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో పరాజయం చవి చూసింది. ఆ రెండు మినహా స్వదేశంలో టీమ్‌ ఇండియా ఎన్నడూ ప్రతి మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూడలేదు. 12 ఏండ్ల అజేయ రికార్డును బ్రేక్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఇప్పుడు కొత్తగా వైట్‌వాస్‌ ఓటమిని సైతం ఇవ్వగలదా? చూడాలి.
ఆ ఇద్దరిపైనే ఫోకస్‌
భారత్‌, న్యూజిలాండ్‌ టెస్టు సవాల్‌ ముంబయికి చేరుకోవటంతో.. సహజంగానే ఇరు శిబిరాల నుంచి ఇద్దరు స్టార్‌ స్పిన్నర్లపై ఫోకస్‌ కనిపిస్తుంది. ఈ రెండు జట్లు చివరగా ఇక్కడ 2021 డిసెంబర్‌లో టెస్టు మ్యాచ్‌లో పోటీపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కానీ న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు ఖాతాలో వేసుకుని అందరి దష్టిని ఆకర్షించాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లోనూ అజాజ్‌ పటేల్‌ నాలుగు వికెట్లు కూల్చాడు. భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 42 పరుగులకే 8 వికెట్లు పడగొట్టాడు. భారత్‌ వరుస ఇన్నింగ్స్‌ల్లో 325, 276/7 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ 62, 167 పరుగులకే కుప్పకూలింది . కివీస్‌ నుంచి ఈసారి అజాజ్‌ పటేల్‌కు మిచెల్‌ శాంట్నర్‌ జతకలువగా.. భారత్‌ శిబిరంలో అశ్విన్‌కు,జడేజా తోడుగా ఉన్నాడు. రెండో రోజు నుంచి స్పిన్‌ను అనుకూలించే పిచ్‌పై స్పిన్నర్ల వికెట్ల వేటనే మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేయనుంది.
హర్షిత్‌ రానా ఇన్‌
మూడో టెస్టుకు భారత జట్టులో మరో బౌలర్‌ జతకలిశాడు. పుణె టెస్టుకు వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకున్న జట్టు మేనేజ్‌మెంట్‌.. తాజాగా యువ పేసర్‌ హర్షిత్‌ రానాను ఎంపిక చేసింది. పేస్‌ విభాగంలో బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌లలో ఎవరికైనా గాయమైందా? లేదంటే పిచ్‌ స్వభావం రీత్యా హర్షిత్‌ రానాను జట్టులోకి తీసుకున్నారా అనే అంశంపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. ఇక న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్టుకు సైతం అందుబాటులో ఉండటం లేదు.
నవంబర్‌ 28 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో విలియమ్సన్‌ అంశంలో ముందుజాగ్రత్తలు తీసుకుంటన్నట్టు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.