బహిరంతరాలలో యుద్ధారావం

సమరభూమిలో సైనికుడు, పూలతోటలో ప్రేమికుడు, విశ్వనగరిలో మానవుడు మఖ్దూం మొహియుద్దీన్‌. ఒడిదొడుకుల జీవితం, జారుడుబండ మీద ప్రయాణం. ఆకలి, దప్పి, అనుక్షణం అవసరమయ్యే డబ్బు. బతుకు చుట్టూ కరువు రుతువు. కోకిలపాటను కలగంటే కూసేది తీతువు. వర్గ సమాజంలో ముందుకు సాగే మార్గమేదీ? మతాల మధ్య భీషణ ఘర్షణ. పోరాటమే ఏకైక మార్గం. ప్రాణం తృణప్రాయమైన యుద్ధనేపథ్యంలో మఖ్దూం బతికాడు, బతికించాడు. అందుకే అతడు, అతని సహచరులు వీరులు, శూరులు, ధీరోదాత్తులు.
అందోల్‌ – ఒక గ్రామం. నిజాం కాలంలోనే అదొక తాలూకా. సంగారెడ్డికి గంట దూరంలో వెలసిన ఊరు. ఆ ఊర్లో మఖ్దూం 1908 ఫిబ్రవరి నాలుగు నాడు జన్మించాడు. మఖ్దూం పూర్వీకుడైన అబూసయీద్‌ ఖాద్రీ మహమ్మద్‌ ప్రవక్త స్నేహితుడు. తండ్రి వంశం వారు క్రమంగా ఉత్తర ప్రదేశ్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత మొగల్‌ చక్రవర్తుల సైనికులుగా క్షతగాత్రుల రక్తం ఎటు ప్రవహిస్తే అటు ప్రయాణించారు. క్రమంగా మెదక్‌ జిల్లా వారి నివాసమైంది. మఖ్దూం చిన్న వయసులోనే తండ్రి చనిపోగా, తల్లి రెండవ వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. బాల మఖ్దూం పోషణ భారం పినతండ్రి మీద పడింది. పినతండ్రి గాంధీజీ అభిమాని. పిల్లలకు, ముఖ్యంగా మఖ్దూంకు పినతండ్రి మూలంగానే జాతీయోద్యమం గూర్చి, నిజాంకు వ్యతిరేకంగా సాగుతున్న విముక్తి పోరాటం గూర్చి తెలిసింది. రష్యాలో లెనిన్‌ నాయకత్వంలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారని, ‘ఇప్పుడు అక్కడ నిరుపేదలు, ధనవంతులు అన్న తేడాలు లేవ’ని పినతండ్రి ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఈ దశలో పడ్డ ఈ బీజం ఆ తర్వాతి కాలంలో మఖ్దూం కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కావటానికి దోహదం చేసింది.
మఖ్దూం పై చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువు అనేక ఆటంకాలతో సాగుతూ వచ్చింది. చెప్పులను దుస్తులలో చుట్టి తలగడగా వాడుకున్న రోజులున్నాయి. ఎట్లాగో డబ్బు సంపాదించాలి. ఒక ధనవంతుడు తాను ప్రేమించే ఆంగ్లో ఇండియన్‌ యువతికి ఆంగ్లంలో ప్రేమలేఖ రాసిపెట్టమన్నాడు. ఆంగ్లంలో వున్న గెథే లేఖాసాహిత్యాన్ని అధ్యయనం చేసి మంచి మంచి ప్రేమలేఖలు రాసిపెట్టి కొంత డబ్బు సంపాదించాడు. ఔషధీ గుణాలున్న కుండలను అమ్మాడు. యూరోపియన్‌ కళాత్మక చిత్రాలకు ఫ్రేములు కట్టి అమ్మాడు. ఒక ఇమాం ఈయన స్థితిని గమనించి మసీదులో రాత్రి నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఒకరోజు దూరపు బంధువు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి అమ్మాయి మఖ్దూం వేలాడే ముఖాన్ని చూసి ఆకలితో వున్నాడని గమనించి వెంటనే ఐదారు రొట్టెలు చేసి పెట్టింది. వాటిని ఆబగా తిని, కొన్ని గంటలపాటు నిద్రపోయాడు. ఆ రొట్టెలు చేసిచ్చిన అమ్మాయే ఆ తర్వాతికాలంలో మఖ్దూం అర్ధాంగి అయింది!
నాటక రచనతో మఖ్దూం సాహిత్య జీవితం మొదలయింది. చదువుకున్న రోజుల్లోనే మఖ్దూం బెర్నార్డ్‌షా రాసిన ‘విడోవర్స్‌ హౌస్‌’ అన్న ఆంగ్ల నాటకాన్ని ‘హోష్‌కెనా ఖాన్‌’ అన్న పేరుతో అనువదించాడు. ఈ నాటక ప్రదర్శనకు రవీంద్రనాథ్‌ ఠాగోర్‌, సరోజినీ నాయుడు కూడా హాజరయ్యారు. ఠాగోర్‌ మఖ్దూం నటనను ప్రశంసించాడు. బి.ఎ. పూర్తయిన తర్వాత తన శాంతినికేతన్‌కు రమ్మని ఆహ్వానించాడు. ఈ వేదిక మీదే హైదరాబాద్‌ రాజ్యంలో మొదటిసారి ‘జనగణమన’ను ఆలపించాడు ఠాగోర్‌. ఆ తర్వాత మఖ్దూం మరికొన్ని నాటకాలను రాసి, ప్రదర్శించి మంచిపేరు తెచ్చుకున్నాడు. ఉర్దూ సాహిత్యంలో ఎం.ఎ. పట్టా సాధించాడు. వివాహం జరిగింది. ఈ దశలోనే కవిత్వం రాయడం ప్రారంభించాడు.
1939లో సిటీకాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది. కవిగా మంచి పేరు వచ్చింది. కమ్యూనిస్టు పార్టీతో బంధం బలపడింది. క్లాసుల్లో పాఠంతో పాటు తన కవిత్వం కూడా వినిపించేవాడు. ‘అంధేరా’ (చీకటి) అన్న కవితను పిల్లల సమక్షంలోనే రాసి పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆయన రాసి ప్రచారంలోకి తెచ్చిన ‘ఇన్‌క్విలాబ్‌’ (విప్లవం) అన్న కవిత కళాశాలలో పెద్ద తుఫాను సృష్టించింది. ప్రభుత్వ పెద్దలు విప్లవభావాలను తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో పార్టీకి మఖ్దూం సేవలు పూర్తి స్థాయిలో అవసరమయ్యాయి. సిటీకాలేజీ ఉద్యోగాన్ని వదులుకొని 1941లో పార్టీకి సేవలందించటానికి పూనుకున్నారు. ఆయన ప్రజాసేవాక్షేత్రంలో త్యాగాల రుతువు మొదలయింది.
విద్యార్థులలో ప్రగతిశీల భావాలను ప్రోది చేసే ఉద్దేశంతో ‘అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌’ స్థాపన జరిగింది. ఇందులో మఖ్దూందే కీలక పాత్ర. ఆ తర్వాత ఇతర మిత్రులతో కలిసి ‘కామ్రేడ్‌ అసోసియేషన్‌’ స్థాపించి ‘ఇత్తెహాదుల్‌ ముస్లిమన్‌’ వంటి మతతత్వ శక్తులతో పోరాటాలు చేశాడు. ‘కహో హిందూస్థాన్‌కి జై’ (హిందూస్థాన్‌కి జైకొట్టు) వంటి మఖ్దూం పాటలు విద్యార్థిలోకంలో కొత్త ఉత్సాహాన్ని రగిలించాయి.
ఒక సాంస్కృతిక, సామాజిక సంస్థగా ప్రారంభమైన ఆంధ్రమహాసభ (1930) దొడ్డి కొమరయ్య హత్యతో రాజకీయ సంస్థగా, అందులో వామపక్ష భావాలున్న సంస్థగా రూపొందింది. క్రమంగా రావి నారాయణరెడ్డి నాయకత్వంలో ఒక మిలిటెంట్‌ సంస్థగా రూపొందింది. కమ్యూనిస్టులే దీన్ని బలోపేతం చేశారు. ఇందులో మఖ్దూం 1946 – 51 మధ్య కాలంలో అజ్ఞాతంగా వుంటూ పనిచేశాడు. జైలు జీవితం కూడా గడిపాడు. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత 1952 సార్వత్రిక ఎన్నికలలో ఓడినా, తర్వాత గెలిచి ప్రతిపక్ష నాయకుడయ్యాడు.
అఖ్తర్‌ హుసేన్‌, డా||జయసూర్య వంటి మిత్రులతో కలిసి ‘అంజుమన్‌ తరక్కి పసంద్‌ ముసన్నిఫన్‌’ అన్న అభ్యుదయ భావాలను సాహిత్య మాధ్యమంగా ప్రచారం చేసే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ప్రారంభ సమావేశంలో వేలాదిగా జనం పాల్గొన్నారు. మఖ్దూం తన కమనీయ కంఠ స్వరంతో గజళ్లను గానం చేస్తూవుంటే జనం మంత్రముగ్దులై వినేవారు. కవిగా ఆయన కవితా సంపుటాలు మూడు. సుర్క్‌ సవేరా (అరుణోదయం, 1944), గులేతర్‌ (పరిమళ పుష్పం, 1961), బిసాత్‌-ఎ-రక్స్‌ (1966) ప్రచురింపబడ్డాయి. ‘సబా’ అనే పత్రిక మఖ్దూం కవిత్వం మీద ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. ‘బిసాత్‌-ఎ-రక్స్‌’ సమగ్ర కవితా సంపుటి.
రాష్ట్రపతిగా వి.వి.గిరి గెలుపొందిన సందర్భంలో ఢిల్లీలో జరిగిన కవిసమ్మేళనంలో పాల్గొనటానికి వెళ్లిన మఖ్దూం మళ్లీ తిరిగి రాలేదు. 1969 ఆగస్టు 20 నాడు గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన సమాధి స్మారక ఫలకం మీద –
‘సమూహాలకు దూరంగా – పాడుకుంటున్నాడు ఏకాంతంలో
వాద్యాల మీద తలవాల్చి – నిద్రపోయాడు తెల్లవారకముందే’ అన్న రెండు పంక్తులు ఉర్దూలో కనిపిస్తాయి.
మఖ్దూం మొదటి కవితా సంపుటి ‘సుర్ఖ్‌ సవేరా’. ఇందులో చాలావరకు ప్రణయభావాలు కనిపిస్తాయి.
‘రాత్రంతా మేలుకొని వున్న తారలకు – నిద్ర ముంచుకొస్తున్నది
నీవు వస్తావనే చివరి ఆశ ఒకటుండేది – అది నిరాశ అవుతున్నది’ (నిరీక్షణ) అంటాడు ఎడబాటు బాధతో.
‘అపరిచితులను చూసి సిగ్గిలుతూ – చేతి గాజులతో ఆడుకునేదానా!
కొత్తవారిని చూసి మౌనముద్ర – దాల్చకు పాడుతూపో
తెలంగాణ సుందర కన్యకా! పాడుతూపో మనోహరంగా’ అంటాడు ‘తెలంగిన్‌’ కవితలో.
‘యే జంగ్‌ హై జంగే ఆజాదీ’ గీతం ఒక మార్చింగ్‌ సాంగ్‌లా సాగుతుంది. యుద్ధం, యుద్ధ భీభత్సం గూర్చిన ఒక వచన కవిత చూడండి :
‘వెళ్ళిపోతున్న ఆ సైనికుణ్ణి అడుగు
ఎక్కడికి పోతున్నావని
ఏడుస్తూనే పాడుతూ
ఆకలితో అలమటిస్తున్న చిన్నపిల్లలను
ఓదార్చుతున్న ఆ దు:ఖిత ఎవరు?
నలువైపులా శవం కాలుతున్న వాసన వేస్తున్నది’
అంటున్నాడు. ఆయుధాలతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు యువకుడు. భర్త కోసం ఏడుస్తూ, పిల్లల కోసం పాటపాడే దు:ఖిత ఒంటరిగా జీవితంలో యుద్ధం చేస్తున్నది. అశేష జన హృదయాలమీద సశేష కవిత్వాన్ని అచ్చువేసినవాడు మఖ్దూం. అందుకే – ‘ఉర్దూ భాష ఉన్నంత కాలం, హైదరాబాద్‌ నగరం ఉన్నంతకాలం మఖ్దూం కంఠస్వరం వినిపిస్తూనే వుంటుంద’న్నాడు ప్రముఖ రచయిత కిషన్‌చందర్‌.

– అమ్మంగి వేణుగోపాల్‌, 9441054637