పానీ ప‌ట్టు యుద్ధం..!

– తలాపున గోదావరి ఉన్న తాగు నీరు కరువు
– నిర్వాసితుల గొంతు తడపని ఎల్లంపల్లి నీరు
– తాగునీరందించడంలో యంత్రాంగం విఫలం
– 13వ బెటాలియన్‌ కుళాయి వద్ద రద్దీ
తలాపున గోదావరి ఉన్నట్లే కానీ ఎల్లంపల్లి నిర్వాసితులకు మాత్రం ఆ నీరు తాగే భాగ్యం లేకుండా పోతోంది. ఇంటింటికి మిషన్‌ భగీరథ పేరుతో నల్లాలు బిగించారు కానీ ఇప్పటికీ శుద్ధ జలం అందించడం లేదు. ఇక్కడి నీరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌ వంటి మహానగర ప్రజల దాహార్తిని తీరుస్తుంది. కానీ ఇక్కడి నిర్వాసితులకు తాగేందుకు గుక్కెడు నీరు లేక తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అధిక గ్రామాల ప్రజలు 13వ పోలీస్‌ బెటాలియన్‌ పెట్రోల్‌ పంపులోని నల్లా నీటినే తాగుతున్నారు. అక్కడ డబ్బా నిండాలంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నవతెలంగాణ – హాజీపూర్‌
ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంచిర్యాల మండలంలోని 9గ్రామాలు ముంపునకు గురికాగా సుమారు నాలుగు వేలకు పైగా కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. అయితే పునరావాస కాలనీల్లో ఇప్పటి వరకు తాగు నీరు అందడం లేదు. కాలనీలు ఏర్పాటు చేసి 10ఏండ్లు గడచినా వీరికి తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఈ కాలనీలన్నీ గోదావరికి, ఎల్లంపల్లికి 2కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉండడం గమనార్హం. కాలనీలు ఏర్పాటు చేసినప్పుడు వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించి నల్లాలు మాత్రమే బిగించారు. కానీ వాటి నుండి శుద్ధ జలం సప్లై చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నామని చెప్పింది. కానీ తమ ఇండ్లకు మంచి నీరైతే రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై 5నెలలు అయినప్పటికీ తాగు నీటి సరఫరాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుండి మంచిర్యాల, బెల్లంపల్లి వంటి పట్టణాలకు సంవత్సరాలుగా తాగు నీరు సరఫరా చేస్తున్న అధికారులు ప్రస్తుతం మాకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ఎల్లంపల్లి నుండి 300కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌ వంటి నగరాలకు తాగు నీరందుతుంది కానీ ప్రాజెక్ట్‌ కోసం సర్వం త్యాగం చేసిన తమకు మాత్రం గుక్కెడు నీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎండలు ముదరడంతో నీటి అవసరాలు పెరిగాయి. ఓ పక్క ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నామని గ్రామీణ నీటి సరఫరా అధికారులు చెబుతున్నారు. కానీ సరఫరా చేసే నీటిని 10 శాతం మంది కూడా తాగడం లేదు. నీరు మురికిగా వస్తుండడంతో తాగలేకపోతున్నారు.
ఒకే నల్లా..ఏడు గ్రామాల ప్రజలు..
13వ బెటాలియన్‌ సిబ్బందికి తాగు నీటి కోసం ముల్కల్ల వద్ద గోదావరి నదిలో పంప్‌ హౌస్‌ ఏర్పాటు చేసి అక్కడి నుండి పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. బెటాలియన్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌లో నల్లాను 10 ఏండ్ల క్రితం బెటాలియన్‌ అధికారులు ఏర్పాటు చేశారు. ఆ నల్లా నీటి కోసం చుట్టు పక్కల ఎల్లంపల్లి పునరావాస కాలనీల ప్రజలే కాక గుడిపేట్‌, నంనూర్‌, రాపల్లి, కర్ణమామిడి, పడతనపల్లి, నర్సింగపూర్‌, చందనపూర్‌ గ్రామాల నుండి కిలో మీటర్ల దూరం నుండి వచ్చి తాగు నీరు తీసుకుపోతుంటారు. నిత్యం వందల మంది ఇక్కడి నల్లా ద్వారా తాగు నీటిని తీసుకెళ్తుంటారు. గంటల తరబడి లైన్‌లో ఉండి నీటిని పట్టుకుంటున్నారు. ఇక్కడ క్యాన్‌ నిండితే యుద్ధంలో గెలిచినంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాగు నీటికి ప్రయాస తప్పడం లేదు : రాజేందర్‌, నంనూర్‌ గ్రామం
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కోసం సర్వం త్యాగం చేసి నిర్వాసితులమైన మాకు ప్రభుత్వం తాగు నీరందిస్తామని చెప్పింది. పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు గడుస్తున్నా నీళ్లయితే రావడం లేదు. బెటాలియన్‌ దగ్గరి నల్లా నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి గంటల తరబడి నిలబడి నీళ్లు పట్టుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్‌ నీరు హైదరాబాద్‌ పోతుంది కానీ కూతవేటు దూరంలో ఉన్న మాకు మాత్రం రావడం లేదు. ఇప్పటికైనా ఇంటింటికీ శుద్ధమైన తాగు నీరు సరఫరా చేయాలి. మిషన్‌ భగీరథ పేరుతో నల్లాలు ఏర్పాటు చేశారు కానీ ఆ నీరు తాగడానికి భయంగా ఉంది.
రంగు చూసి జనం తాగడం లేదు : గిరిజ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ, హాజీపూర్‌
ఇంటింటికి తాగు నీరు సరఫరా అవుతోంది. క్లోరినేషన్‌ చేసిన శుద్ధ జలాన్ని సరఫరా చేస్తున్నాం. రంగు చూసి ప్రజలు అపోహాలు పడుతూ తాగడం లేదు. పలు మార్లు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ట్యాప్‌ ద్వారా వచ్చే నీటిని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.