రెడ్‌సీలో ర‌ణ‌రంగం

Battlefield in Redsea– సముద్రంలో కార్గో నౌకలపై హౌతీ దాడులు
–  డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం
–  అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం
–  పెరగనున్న చమురు, నిత్యావసరాల ధరలు
–  భారత్‌లోనూ ఆందోళన
జెరూసలేం : ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధ జ్వాలలు ఇప్పుడు సముద్రానికీ వ్యాపించాయి. సముద్రం ఇప్పుడు అనేక దేశాలకు యుద్ధ భూమిగా మారింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్న హౌతీ రెబల్స్‌ ఇజ్రాయిల్‌ వెళుతున్న లేదా ఆ దేశంతో సంబంధం ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.
ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య అక్టోబర్‌ 7న యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయిల్‌లో ప్రవేశించిన హమాస్‌ వందలాది మందిని హతమార్చి 200 మందికి పైగా ప్రజలను బందీలను చేసింది. దీంతో హమాస్‌ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ గాజా, గాజా స్ట్రిప్‌పై భీకర పోరు ప్రారంభించి పాలస్తీనియా ప్రజలను పెద్ద సంఖ్యలో పొట్టనపెట్టుకుంటోంది. ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో ఇజ్రాయిల్‌ దాడులను వ్యతిరేకిస్తున్న హౌతీ రెబల్స్‌ కూడా ఆ దేశానికి చెందిన నౌకలపై దాడులు చేస్తున్నారు. వీరు ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం మీదుగా వెళుతున్న అనేక నౌకలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేస్తున్నారు. కొన్ని నౌకలను దోచుకుంటున్నారు. గడచిన నెల రోజుల వ్యవధిలోనే హౌతీ రెబల్స్‌ 12 సార్లకు పైగా వాణిజ్య నౌకలపై దాడులు చేశారు.
జరిగిన దాడులు ఇవే
గత నెల 19న హౌతీ రెబల్స్‌ బ్రిటన్‌కు చెందిన కార్గో నౌక ‘గలాక్సీ లీడర్‌’పై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నారు. సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న నౌకపై సినీ ఫక్కీలో హెలికాప్టర్‌ను దింపి సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ నెల 3న ఇజ్రాయిల్‌కు చెందిన రెండు నౌకలపై దాడి చేశారు. 12వ తేదీన నార్వే ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేశారు. ఈ దాడిలో ట్యాంకర్‌కు నిప్పంటుకున్నప్పటికీ ఎవరూ గాయపడలేదు. 13వ తేదీన బాబ్‌ అల్‌ మాన్‌దేబ్‌ జలసంధిలో మన దేశానికి చెందిన కార్గో నౌకపై రెండు క్షిపణులను ప్రయోగించారు. అయితే అదృష్టవశాత్తూ ఆ దాడి నుండి భారత నౌక తప్పించుకోగలిగింది. ఈ నెల 22న శుక్రవారం నాడు అరేబి యా సముద్రంలో ఓ నౌకపై దాడి జరిగింది . గుజరాత్‌లో ని వెరావల్‌ కు నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం నౌకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మంటలను సకాలంలో ఆర్పివేశారు. సౌదీ అరేబియా ఓడరేవు నుండి ఈ నౌక మంగళూరు వస్తుండగా ఈ ఘటన జరిగింది. శనివారం దక్షిణ ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ నౌకా ప్రయాణ మార్గాలపై హౌతీ రెబల్స్‌ నౌకా విధ్వంసక బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడులలో జరిగిన నష్టం వివరాలు ఇంకా అందలేదు.
ధరలు పెరిగే అవకాశం
ముడి చమురు, ఇతర నిత్యావసర వస్తువులతో సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకొని హౌతీ రెబల్స్‌ దాడులు సాగిస్తున్నారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చమురు ధరలు మాత్రమే కాకుండా నిత్యావసరాల ధరలు కూడా భగ్గుమనే అవకాశం ఉంది. ఈ దాడుల కారణంగా తన వ్యాపారానికి విఘాతం కలగవచ్చునన్న ఆందోళన భారత్‌లో కూడా కన్పిస్తోంది. హౌతీ రెబల్స్‌ దాడులపై ప్రధాని మోడీ ఇటీవలే ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూతో మాట్లాడారు. సముద్ర మార్గంలో భద్రతపై వారిద్దరూ పరస్పరం ఆందోళనను పంచుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఈ దాడులు ఆగిపోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ సరఫరాలకు ఆటంకం
హౌతీ దాడుల కారణంగా సముద్ర మార్గంలో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్యం బాగా దెబ్బతింది. ఎందుకంటే ఎర్ర సముద్రం మీదుగానే వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పశ్చిమాసియా మాత్రమే కాకుండా అరేబియా, యూరప్‌, ఆఫ్రికా, భారత్‌ కూడా సముద్ర మార్గం ద్వారానే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హౌతీ రెబల్స్‌ దాడుల కారణంగా అంతర్జా తీయ సరఫరా లకు ఆటంకం కలుగు తోంది . దాని ప్రభావం ఇప్పటికే కన్పిస్తోంది. దాడుల నేపథ్యంలో ప్రపంచంలోని అతి పెద్ద కార్గో కంపెనీలు ఇకపై ఎర్ర సముద్రం ద్వారా తమ సరకు రవాణా నౌకలను పంపడానికి ఇష్టపడవు. ఆ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటాయి. అయితే దీనివల్ల దూరం పెరుగుతుంది. ఫలితంగా ఖర్చు కూడా పెరుగుతుంది. వ్యయం పెరిగితే దాని ప్రభావం ఈరోజు కాకపోయినా రేపైనా ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. చివరికి ఆ భారాన్ని మోయాల్సింది వినియోగదారులే.
ఎర్ర సముద్రమే ఎందుకు?
హౌతీ రెబల్స్‌ తమ దాడులకు ఎర్ర సముద్రాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? ప్రపంచ వాణిజ్యంలో 12% ఈ సముద్రం మీదుగానే జరుగుతోంది. ఈ మార్గం ద్వారా ప్రతి సంవత్సరం 10 బిలియన్‌ డాలర్ల కంటే అధిక విలువ కలిగిన సరుకులు ఎగుమతి లేదా దిగుమతి అవుతున్నాయి. దీనిని బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎర్ర సముద్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అర్థమవుతుంది. హౌతీ రెబల్స్‌ ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ దాడుల వల్ల అంతర్జాతీయ సమాజంలో అలజడి మొదలవుతుందని, హమాస్‌పై యుద్ధానికి స్వస్తి చెప్పవలసిందిగా ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచుతాయని వారు భావిస్తున్నారు.
ప్రపంచానికి ఎర్ర సముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ సముద్రంలో జరిగే దాడుల నుండి నౌకలను కాపాడేందుకు అమెరికా 20 దేశాలతో ఓ కూటమిని ఏర్పాటు చేసింది. నౌకల భద్రతపై ఈ దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. సభ్య దేశాల మధ్య కుదిరే ఒప్పందాల ప్రాతిపదికనే ఏ కార్యకలాపమైనా జరుగుతుంది.
ఆ నౌక భారత్‌ది కాదు…గబాన్‌ది
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ఇరవై ఐదు మంది సిబ్బందితో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్‌ డ్రోన్‌ దాడికి గురైంది. హౌతీ రెబల్స్‌ ఈ డ్రోన్‌ను ప్రయోగించారని అమెరికా సైన్యం చెబుతోంది. దాడి జరిగిన తర్వాత ట్యాంకర్‌ నుండి అదే ప్రాంతంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకకు సందేశం వెళ్లింది. పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్‌ దేశానికి చెందిన ఈ నౌక పేరు ‘ఎంవీ సాయిబాబా’. డ్రోన్‌ దాడిలో ఎవరూ గాయపడలేదని, నౌకలోని 25 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని భారత నౌకాదళ అధికారులు ధృవీకరించారు. నౌకపై భారత్‌ పతాకం ఉన్నదని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది గబాన్‌కు చెందిన నౌక అని, భారతీయ షిప్పింగ్‌ రిజిస్టర్‌ నుండి సర్టిఫికేషన్‌ పొందిందని నౌకాదళం వివరణ ఇచ్చింది.