యుద్ధభూమి బైరాన్‌పల్లి

Battleground Byranpallyతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బైరాన్‌పల్లి వీర బైరాన్‌పల్లిగా ఖ్యాతి పొందింది. నైజాం సైన్యాలు 96 మందిని నిలబెట్టి మిషన్‌ గన్నులతో ఒకేసారి కాల్చి చంపిన సామూహిక హత్యాకాండ. చరిత్రలో మరో జలియన్‌ వాలాబాగ్‌గా శాశ్వతంగా నిలిచిపోయిన విషాద సంఘటన. బైరాన్‌పల్లి ప్రజల వీరోచిత ప్రతిఘటన భావితరాలకు జీవించే హక్కుకై, స్వేచ్చా స్వాతంత్య్రాలకై యిచ్చిన సందేశం అమరుల బలిదానం. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన జగ్గం హనుమంతు, చల్ల నర్సిరెడ్డి, మోటం పోషాలు. మోటం రాములు, యిమ్మడి రామిరెడ్డి, బాలరాజు, రాజలింగం, బలిజ రాజయ్య, మురళీధర్‌ రావు మొదలైన వారితో స్థానిక పోరాట కమిటీ ఏర్పడింది.
బైరాన్‌పల్లి పరిసర గ్రామాలైన దూల్మిట్ట, కూటిగల్లు, హుస్నాబాద్‌, రేబర్తి, అంకుషాపురం గ్రామాల పైన రజాకారులు దాడులకు తెగబడుతున్నప్పుడు, ఏసిరెడ్డి నర్సింహారెడ్డి, కొత్త ముకుందారెడ్డి గారల నాయకత్వాన వారి సాయుధ దళాలతో నైజాం మూకలను, రజాకారులను అనేకమార్లు తరిమికొట్టిన చరిత్ర వీరిద్దరికి ఉన్నది.
కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ ఈ మూడు జిల్లాల సరిహద్దు గ్రామమైన బైరాన్‌పల్లి ఆ కాలంలోనే పెద్ద గ్రామం. ఊరు మధ్యలో బురుజును కేంద్రంగా చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని, తుపాకులు మందు గుండు తదితర వనరులన్నీ సమకూర్చుకొని, వంట సరుకులతో గ్రామానికి ఎల్లవేళలా కాపలా కాస్తూ బురుజుపై దళం ఉండేది. కక్షగట్టిన నైజాం పోలీసు రజాకారులు వరుసగా నాలుగుసార్లు బైరాన్‌పల్లిపై దాడి చేశారు. దాడి చేసిన ప్రతిసారి బైరాన్‌పల్లి వీరులు నైజాం మూకలను, రజాకారులను, నైజాం పోలీసులను తరిమి తరిమి కొట్టారు. దాడి చేసినప్పుడల్లా మరింత రెట్టింపైన ఉత్సాహంతో తరిమికొట్టేవారు భైరాన్‌పల్లి వీరులు.
నాలుగు పర్యాయాలు ఓటమి పాలై అవమాన భారంతో రజాకార్లు ఏరోజైనా దాడికి పూనుకోవచ్చునని, బైరాన్‌పల్లి ప్రజలు రాత్రివేళ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేసింది సాయుధ పోరాట కమిటి. ఈ ఆదేశాలు చకిలం యాదగిరిరావు ద్వారా అక్కడి ఆర్గనైజర్‌ మురళీధర్‌ రావుకు అందింది.
బైరాన్‌పల్లి దాడిని నిజాం ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించింది. డిప్యూటీ కలెక్టర్‌ ఎక్బాల్‌ హుస్సేన్‌ నాయకత్వాన 400 మంది నిజాం సైనికులు 1948, ఆగస్టు 27 రాత్రి 12 గంటలకు బయలుదేరి తెల్లవారు జామున 4-00 గంటలకు బైరాన్‌పల్లెను చుట్టుముట్టారు.
బైరాన్‌పల్లి ప్రజలపై పగ తీర్చుకోవాలని తాలుకా డిప్యూటీ కలెక్టర్‌ హషీమ్‌ నాయకత్వంలో ప్రభుత్వం పంపించిన సైనిక బలగాన్ని వెంటేసుకొని సుశిక్షితమైన సైన్యంతో ట్యాంకులు, లారీలు, జీబులతో సైన్యం వచ్చింది. సైన్యానికి ఆధునిక ఆయుధాలన్నీ ఉన్నవి. పిరంగులు, మంట బాంబులు, 303 రైఫిల్లు, స్టెన్‌ గన్నులు, బ్రేన్‌ గన్నులు మొదలైన అనేక ఆయుధాలతో, కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌, సివిల్‌ అధికారులంతా ఉన్నారు. జనగామ నుండి రాత్రి 12 గంటలకు బయలుదేరినారు. ముత్యాల గ్రామానికి రాత్రి రెండు గంటల కల్లా చేరుకున్నారు. అక్కడి క్యాంపులో ఉన్న రజాకారులను తీసుకొని, నాలుగు గంటలకు చేరుకొని బైరాన్‌పల్లిని అర కిలోమీటరు దూరం నుండి చక్రబంధంతో చుట్టుముట్టారు. ఆ ఊరి బ్రాహ్మణుడు విశ్వనాధం కాలకత్యాలు తీర్చుకోవడానికి బయటకు రాగానే, ఆ మిలిటరీ అంతా కనబడింది. చూసిన వెంటనే వెనుతిరిగి ఊరిలోకి వెళ్లి ఊరును నైజాం మిలిటరీ చుట్టుముట్టిందనే వార్త చెప్పాడు.
ఊరును చుట్టుముట్టిన సైన్యం పిరంగులతో బురుజుపైన దాడి చేశారు. బురుజు గోడలు కూలిపోయాయి. బురుజు పైన రక్షణగా ఉన్న కప్పు కూలిపోయింది. ఒక్కసారిగా ఊరు నలుమూలల నుండి దాడి ఏకకాలంలో ప్రారంభమైంది. ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. పారిపోవడానికి వీలులేకుండా చేయడంతో చక్రబంధంలో చిక్కుకుపోయింది బైరాన్‌పల్లి. వెలుగులు విరజిమ్మే బాంబులను పేల్చి, పారిపోతున్న ప్రజలను ఆ వెలుతురులో గురిచూసి కాల్చారు. తుపాకీ గుండ్లకు ఎక్కడ చిక్కిన వారు అక్కడే నేలకొరుగుతున్నారు. ఊరు లోపల ఊరు బయట ఈ నరమేదం జరిగింది. ఇలా తెల్లవారే వరకు పోరాటం నడుస్తూనే ఉంది. ఎదిరించేవాళ్లు రజాకార్లతో తలపడుతూ నేలకొరుగుతున్నారు. రజాకార్లూ ప్రజల చేతిలో హతమవుతున్నారు.
ఆధునిక ఆయుధాలతో ఉన్న నైజాం మిలట్రీతో బైరాన్‌పల్లి యుద్ధతంత్రం గెలవలేక పోయింది. దొరికిన ప్రజలందరినీ బురుజు దగ్గర ఒకచోటకు చేర్చి అందరిని నిలబెట్టారు. బురుజుపైన చనిపోగా మిగిలిన వారిని కిందికి దించారు. అందరిని వరుసగా తాళ్ళతో బందించి, నిలబెట్టి కాల్చడం ప్రారంభించారు. ఏ తుపాకీ గుండు ఎందరిని చంపుతుందో తుపాకీ గుండు సామర్థ్యాన్ని పరీక్షించుకుంటున్నారు అధికారులు. ఈ విధంగా బురుజు ముందు 96 మందిని చంపిన ఘోర నరమేధం బైరాన్‌పల్లిలో జరిగింది. ఊరు నిండా రక్తం ఏరులై పారింది. బురుజుముందు శవాలు పడి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో కొత్త ముకుందారెడ్డి దళం బైరాన్‌పల్లికి చేరుకొని తుపాకులతో అగావు దెబ్బలు పేల్చడంతో, దళాలు వస్తున్నాయని భయపడిన ముష్కరులు కూటికల్లు వైపు పారిపోయారు. పారిపోతూ కూటికల్లులో మరో 20 మందిని చంపారు. బైరాన్‌పల్లి ప్రజల ప్రతిఘటనలో 25మంది నైజాం పోలీసు రజాకార్లు మరణించారు. ఈ దాడిలో 117 మంది ప్రజలు అసువులు బాసారని పలువురు రాసిన పుస్తకాలల్లో పేర్కొన్నారు. ఈ పుస్తక ముద్రణకు ముందు నేను (పుస్తక రచయిత) బైరాన్‌పల్లిలో ఆనాటికి బతికున్న వారితో మాట్లాడినపుడు, పంటచేండ్లల్ల, అడవి పొదలల్ల మరో 150 మందికి పైగా మరణించారని, సుమారు 250 మంది వరకు మరణించారని ప్రజలు చెప్పారు. జలియన్‌ వాలాబాగ్‌ను తలపించే ఘటనగా చరిత్రకారులు దీన్ని లిఖించారు. బైరాన్‌పల్లి వీర బైరాన్‌పల్లిగా చరిత్రకెక్కింది.
బైరాన్‌పల్లి పై దాడి చేసిన నైజాం పోలీస్‌ రజాకారులను హతమార్చి తరిమి కొట్టడంలో ముకుందారెడ్డి ప్రముఖ పాత్ర వహించారు. బైరాన్‌పల్లిని నామరూపాలు లేకుండా నేలమట్టం చేయాలనే కసితో వచ్చిన నైజాం పోలీసు రజాకార్లు, కొత్త ముకుందారెడ్డి దళం రావడంతో సాయుధ దళాలు వస్తున్నాయని భయపడి నైజాం పోలీస్‌ అధికారి హెచ్చరికతో ముష్కరులు పారిపోయారు. బైరాన్‌పల్లి గ్రామంలో ప్రతీ రాత్రి ప్రజలు ఊరులో ఉండకుండా చూడాలని కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు పరచకుండా ఉదాసీనత వహించినందుకు, బాధ్యతారహితంగా ఉన్నందుకు మురళీధర్‌రావును బాధ్యతల నుంచి సస్పెండ్‌ చేశారు. ఏరియా దళ కమాండర్‌గా తన బాధ్యతను నిర్లక్ష్యం చేసినందుకు చకిలం యాదిగిరి రావును పోరాట కమిటీ మందలించింది.
– సాంబరాజు యాదగిరి, 9346018141