ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌లో మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ

 24న కాన్‌బెర్రాలో ప్రదర్శితం
 కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రవాస భారతీయ సంఘాలు
న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్ల విషయంలో మోడీ పాత్రపై వచ్చిన బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా- ది మోడీ క్వశ్చన్‌’ ఆస్ట్రేలియన్‌ పార్లమెంటులో ప్రదర్శనకు సిద్ధమైంది. ఈనెల 24న కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ హౌజ్‌లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించను న్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, పెరియార్‌ అంబేద్కర్‌ థాట్స్‌ సర్కిల్‌-ఆస్ట్రేలియా వంటి కొన్ని ప్రవాస సంస్థల సమూహం చేపడుతున్నాయి. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అదే వారం ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్యటించనుండటం చర్చనీయాంశంగా మారనున్నది.
ఇండియా: ది మోడీ క్వశ్చన్‌ అనేది రెండు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌. దీనిని ఇప్పటికే బీబీస ప్రదర్శించింది. 2002 గుజరాత్‌ అల్లర్ల గురించి, ఆ సమయంలో అప్పటి గుజరాత్‌ సీఎం, ప్రస్తుత భారత ప్రధాని మోడీ రాజకీయ జీవితాన్ని, అల్లర్లలో ఆయన పాత్ర గురించి ఈ డాక్యుమెంటరీ తెలియజేస్తుంది. అయితే, ఈ డాక్యుమెంటరీని భారత్‌లో ప్రదర్శితం కాకుండా మోడీ సర్కారు యూట్యూబ్‌, ట్విట్టర్‌ సంస్థలను ఆదేశించింది. దీంతో భారతీయులు ఈ డాక్యుమెంటరీని చూసే అవకాశాన్ని పొందలేకపోయారు. బీబీసీ డాక్యుమెంటరీ అనంతరం.. న్యూఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ సోదాలు సైతం జరిగిన విషయం విదితమే.