బీసీ కులగణన బూటకపు సర్వే…

– బిసి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్..
నవతెలంగాణ మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే రిపోర్టు పూర్తిగా బూటకపు సర్వేగా అభివర్ణిస్తున్నామని బిసి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు   పానుగంటి విజయ్ అన్నారు . బుధవారం మండల కేంద్రంలో ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ  సర్వేలో గత 2014 సమగ్ర కుటుంబ సర్వే లో 51 శాతం గా ఉన్న బీసీల సంఖ్యను ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో 46 శాతానికి కుదించడం దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఓసిల  సంఖ్యను రెట్టింపు చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ లా సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం అని మండిపడ్డారు. తెలంగాణలో సమగ్రంగా చేయని సర్వే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సర్వే చేస్తా అంటే నమ్మడం ఎలా అని ప్రశ్నిస్తున్నాం…? మొత్తం బీసీల సంఖ్య గత పది సంవత్సరాల నుండి పెరగాలి కాని తగ్గడం ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.  ఈ సంఖ్యని తగ్గించి రిజర్వేషన్లు కుదించి ఓసిల సంఖ్యను ఎక్కువ చూయించి ఈ డబ్ల్యూ ఎస్  రిజర్వేషన్లు కాపాడే కుట్ర చేస్తూ బీసీలను దాగ చేస్తున్నారని  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.
అసలు హైదరాబాద్ లో సమగ్ర సర్వేను సరిగా చేయలేదన్నారు .ప్రస్తుతం నడుస్తున్నది ప్రజా పాలన కాదని “రెడ్డి పాలనని అగ్రకుల పాలనని మొత్తం రెడ్లతో అసెంబ్లీ,శాసనమండలి  నిండిపోయిందని బీసిలకి స్థానం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన సర్వే రిపోర్ట్ కాపీలని రాష్ట్రవ్యాప్తంగా తగలబెడతామని తక్షణమే తిరిగి హైదరాబాద్ తో సహా రీ సర్వే చేసి అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .కామారెడ్డి బిసి డిక్లరేషన్ అమలు చేసి చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్ లు 42శాతం అమలు చేయాలని కోరారు.  అంతే కానీ పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తాం మిగతా పార్టీలు కూడా ఇవ్వాలనే ప్రతిపాదన తప్పు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని తెలిపారు .జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలు బిసి లకు నువ్వు చెపితే ఎవరు ఇస్తారు , ఇది కూడా అగ్రవర్ణాలకు మేలు చేసేదే తప్ప బిసి లకు ఒరిగేది ఏమి లేదు అని అన్నారు .ఇప్పటికైన ఆలోచించి బిసి లకు మేలు చేసే విధంగా బీహార్ తరహాలో రీ సర్వే చేసి చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్ లు అమలు చేయాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.