బిసి డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలి 

BC declaration guarantees should be implemented immediately– మండల బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుల డిమాండ్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీలపై ఏ మాత్రమూ చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బీసీ డిక్లరేషన్‌ హామీలను అమలు చేయాలని మల్హర్‌రావు మండల బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రమైన తాడిచర్ల లో మండల బిజెపి ఓబీసీ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో  తహసీల్దార్ కార్యాలయంలో ఇంచార్జీ ఆర్ఐ జి నరేష్ కు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీ వెంటనే అమలు చేయాలని, బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీని అమలుచేయలేదని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేసి వారికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వారం రోజుల్లో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించాలని కోరారు. బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేయాలని అలాగే గొల్లకురుమలకు వంద రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఎకౌంట్లో వేస్తామని ఇచ్చిన హామీ మరిచి గొల్ల కురుమలను మోసం చేశారని విమర్శించారు. ఎంబీసి కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సమయం గడుస్తున్నా నేటికీ రాష్ట్రంలో ఉన్న మత్స్యసంఘాలకు చేప పిల్లల పంపిణీ చేయకుండా బీడ్లు ఆహ్యనించి వంద కోట్ల రూపాయల వరకు అవినీతికి తెర లేపినట్లు అర్థం అవుతుందన్నారు. ముదిరాజ్, గంగపుత్ర, గౌడ్, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే వారం రోజుల్లో డిమాండ్ల పరిష్కారానికి చర్యలు ప్రారంభించకపోతే జిల్లా కలెక్టరేట్లలో ధర్నాలు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ముడితనపెల్లి ప్రభాకర్, బిజెపి ఓబిసి మోర్చా మండల నాయకులు ఐలపురం సందీప్, కోట నవీన్, బిజెపి ఓబీసీ మోర్చా నాయకులు మల్లెవేణి రమేష్, గాదనవేన రాజయ్య, అంగజాల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.