విద్యుత్‌ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలి : బీసీ ఉద్యోగుల మహాసభ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యుత్‌ సంస్థలో పదోన్నతులను తక్షణమే సమీక్షించాలని తెలంగాణ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 18వ మహా సభను గురువారం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఆడిటోరియంలో కోడెపాక కుమార స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థల్లో పదోన్నతుల సమీక్ష, 2009 తర్వాత నేరుగా నియమించిన ఉద్యోగులకు మెరిట్‌ ఆధారంగా జూనియర్‌ లైన్‌మెన్‌, సబ్‌ ఇంజనీర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్లు, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, కెమిస్ట్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లు తదితరులకు పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లో పనిచేస్తున్న సుమారు 3,500 మంది జూనియర్‌ లైన్‌మెన్‌లకు వెంటనే అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పదోన్నతులు కల్పించాలనీ, విద్యుత్‌ సంస్థల్లో 1999 నుంచి 2004 వరకు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్‌ స్కీం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీజన్‌ ఉద్యోగులక రెగ్యులర్‌ ఉద్యోగుల నిబంధనలు వర్తింపజేసి జూనియర్‌ లైన్మెన్‌ గా, జూనియర్‌ అసిస్టెంట్లుగా, సబ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించాలని, విద్యుత్‌ సంస్థల్లో 50 శాతం డైరెక్టర్‌ పోస్టులను బీసీ అధికారులచే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో 2024 డైరీ మరియు కాలెండర్లను జాతీయ అధ్యక్షులు ఆర్‌ కష్ణయ్య ఆవిష్కరించారు. మహా సభకు విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న బీసీ ఉద్యోగులు వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మహాసభకు రాష్ట్ర నాయకులు నీలారపు రాజేందర్‌ ఎన్‌ సదానందం, ఎం విజయ కుమార్‌, కొముర వెల్లి రవీందర్‌, పి.యాదగిరి, డాక్టర్‌ చంద్రుడు, ఎం.అశోక్‌ కుమార్‌, జి.బ్రహ్మేంద్ర రావు, టి నరేందర్‌, మారం శ్రీనివాస్‌, రంగు సత్య నారాయణ, పి అశోక్‌ వెంకటేష్‌, కిషోర్‌, సామల శివాజీ తదితర నాయకులు సారథ్యం వహించారు.