బీసీ బాలికల గురుకుల కళాశాలకు సొంత భవనం కేటాయించాలి

– ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పోతారం గ్రామంలోని మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల పాఠశాల, కళాశాల కు సొంత భవనం కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ ఒక ప్రకటనలో కోరారు. గత ఆరు సంవత్సరాలుగా  అద్దె భవనంలో కొనసాగుతుందని అన్నారు. దీంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పాఠశాల కళాశాలగా మారినప్పటికీ సరిపడు తరగతి గదులు లేక విద్యార్థినిలను వర్గల్  బిసి గురుకుల పాఠశాలకు అనుసంధానం చేశారని తెలిపారు. ఈ ఏడాది  అడ్మిషన్లను ఇక్కడ చేర్పించుకుని తరగతులు, హాస్టల్ వసతి కోసం వర్గల్ బీసీ గురుకులకు పంపిస్తున్నారని పేర్కొన్నారు.హుస్నాబాద్  ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాల పూర్తిగా వర్గల్ కు వెళ్లిపోతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. స్థానిక  విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  పరిశీలించి  వెంటనే స్పందించాలని కోరారు.