బీసీ ద్వేషి బీజేపీ

– కేంద్రం వారికి చేసింది ఏమీ లేదు : మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బీసీ వ్యతిరేక పార్టీ అనీ, ప్రధాని నరేంద్రమోడీ హయాంలో వారికోసం చేసింది ఏమీ లేదని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. శుక్రవారంనాడిక్కడి బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, అంజయ్య యాదవ్‌లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కనీసం బీసీ కులగణన కూడా చేయడం లేదనీ, వారికోసం కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకానికే సీఎం కేసీఆర్‌ అంతకంటే ఎక్కువ నిధులు కేటాయించారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఉన్నదని అన్నారు. బీజేపీ డిక్లరేషన్‌ ఓ ఎన్నికల స్టంట్‌ అనీ, దాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా…అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు బీసీలను ఓట్‌ బ్యాంక్‌గానే చూస్తున్నారనీ, బీఆర్‌ఎస్‌ మాత్రమే వారికోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని వివరించారు.