బీఆర్‌ఎస్‌లో ‘బీసీ’ ఒక్కడే

'BC' is the only one in BRS– ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొరవడిన సామాజిక న్యాయం
– 11 స్థానాల్లో రెండు ఎస్సీ రిజర్వుడ్‌
– 9 జనరల్‌ స్థానాల్లో బీసీ ఒక్కరే
– బీసీ ఆశావహుల్లో తీవ్ర నిరాశ
– బీఆర్‌ఎస్‌కు ముదిరాజుల మూకుమ్మడి దూరం
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో సామాజిక న్యాయం కొరవడింది. 11 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే ఒక్క బీసీకి చోటు లభించింది. రెండు ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలు పోగా మిగతా తొమ్మిది స్థానాల్లో ఓసీలకే టికెట్లు కేటాయించారు. ఐదుగురు రెడ్లు, ముగ్గురు వెలమ సామాజిక తరగతులకు చెందిన వాళ్లే పోటీ చేయనున్నారు. కేసీఆర్‌ అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీ ఆశావహులకు నిరాశ తప్పలేదు. టికెట్లు ఆశించిన ముగ్గురు ముదిరాజ్‌ సామాజిక తరగతికి చెందిన ఆశావ హులు అసమ్మతి గళం వినిపిస్తూ వేరుకుంపటి పెడుతున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఎంత బుజ్జగించినా వినే పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌ నుంచి బి-ఫామ్స్‌ ఇచ్చే వరకు శాంతించేది లేదంటూ ముది రాజ్‌లు మూకుమ్మడిగా తిరుగు బాటు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తే.. అధిపత్య కులాలదే పైచేయిగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌లో గత రెండు పర్యాయాలు ఓసీలే పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మూడో సారి కూడా ఆ పార్టీలో వెలమ, రెడ్డి సామాజిక తరగతులకే పెద్ద పీట వేశారనే ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మేనల్లుడు తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎస్సీ రిజర్వుడు స్థానాలు పోగా మిగతా అన్ని చోట్ల కూడా ఓసీలనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని, సామాజిక న్యాయం అమలు చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపించే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అధికార పార్టీ మాత్రం మచ్చుకు ఒకే ఒక సీటు బీసీకి కేటాయించి చేతులు దులుపు కుంది. అనేక మంది బీసీ ఆశా వహులు పార్టీ కోసం కష్టపడి పని చేశారు. సామాజిక సేవా కార్య క్రమాల ద్వారా ప్రజాదరణ పొం దారు. అధికార పార్టీలో కొనసాగుతున్న అనేక మంది బీసీలకు కనీస గుర్తింపు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎన్నికల వేళ ఇద్దరు, ముగ్గురు ఉద్యమకారులకు రాష్ట్ర స్థాయి చైర్మెన్‌ పదవులు కట్టబెట్టిన బీఆర్‌ఎస్‌.. అంతిమంగా బీసీలకు మరోసారి మోసమే చేసిందని విమర్శలు వెలువడుతున్నాయి.
బీసీ ఆశావహులకు నిరాశ
బీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న పలువురు బీసీ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. పార్టీలో కష్టపడి పనిచేయడంతో పాటు స్వంత డబ్బులు ఖర్చు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. తీరా కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చోట లభించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి చిట్కూల్‌ ఏకగ్రీవ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌ టికెట్‌ కోసం ఎంతో కష్టపడ్డారు. నియోజకవర్గంలో 70 వేల మంది ముదిరాజ్‌ ఓటర్లున్నారు. ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో నీలం మధు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. తీరా తనకు అవకాశం కాకపోయే సరికి నెల రోజులుగా తన అనుచరులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు బుజ్జగించినా తగ్గడంలేదు. సంగారెడ్డి టికెట్‌ కోసం ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ వైస్‌ చైర్మెన్‌ పట్నం మాణిక్యం ముదిరాజ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా అవకాశం రాకపోయే సరికి ఆయన తన అనుచ రులతో ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారు. ఈ నెల 22న తన పుట్టిన రోజున భారీ జనసమీకరణతో ఊరేగింపు, సభ పెట్టి తానే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించుకున్నారు. ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షులు, బీఆర్‌ఎస్‌ నాయకులుగా ఉన్న పులి మామిడి రాజు కూడా టికెట్‌ ఆశించి రాకపోయేసరికి ఇటీవల ఆయన బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ముగ్గురు కీలకమైన ముదిరాజ్‌ తరగతికి చెందిన నాయ కులకు అవకాశం రాకపోయే సరికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముదిరాజులు బీఆర్‌ఎస్‌కు దూరం అయ్యే అవకాశముంది. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ముదిరాజ్‌లు సమావేశమై బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గజ్వేల్‌లో ఈటల కుటుంబంలో ఎవరో ఒకరు పోటీ చేస్తే బీఆర్‌ఎస్‌కు ముదిరాజ్‌ ఓటర్లు మరింత దూరమవుతారనే చర్చ వినిపిస్తుంది.
ఐదుగురు రెడ్లు.. ముగ్గురు వెలమలు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో.. జహీరాబాద్‌, అందోల్‌ ఎస్సీలకు రిజర్వుడు చేయబడ్డాయి. మిగతా తొమ్మిదిలో సంగారెడ్డి మాత్రమే బీసీకిచ్చారు. మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికే ఇచ్చారు. నర్సాపూర్‌ టికెట్‌ పెండింగ్‌లో పెట్టినా రెడ్డి సామాజిక తరగతికే దక్కనుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి వీరిద్దిరిలో ఒకరికి ఛాన్స్‌ రానున్నది. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలుండగా, గజ్వేల్‌ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, సిద్దిపేట నుంచి తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్‌ నుంచి వడితల సతీష్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు కూడా వెలమ సామాజిక తరగతికి చెందిన వారే. దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించారు.
చింత ప్రభాకర్‌ ఒక్కరే బీసీ..
11 స్థానాలకు గాను ఒకే ఒక బీసీ వ్యక్తికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పద్మశాలి బీసీ సామాజిక తరగతికి చెందిన చింత ప్రభాకర్‌కు టికెట్‌ ప్రకటించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న చింత ప్రభాకర్‌ టీడీపీలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో తిరిగి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. దాంతో చింత ప్రభాకర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు చేనేత అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మెన్‌ పదవిని కూడా ఇచ్చారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై కోలుకున్నారు. తిరిగి మూడో సారి పోటీ చేసేందుకు పార్టీ అవకాశం కల్పించింది.