– అధికార పార్టీలో చలనం
నవతెలంగాణ-గజ్వేల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ రాగం ఉవ్వెత్తున లేస్తోంది. గజ్వేల్ వేదికగా బీసీ కులాల ఐక్యవేదిక కమిటీ ఏర్పడి పార్టీలకతీతంగా గత మూడు నెలలుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కమిటీ పర్యటిస్తూ మండల కమిటీలను, గ్రామ కమిటీలను, ఏర్పాటు చేస్తుంది. మంగళవారం గజ్వేల్ లో నిర్వహించిన బీసీ కులాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశానికి నియోజకవర్గం నుండి ఏడు మండలాల నుండి భారీ సంఖ్యలో అన్ని కులాలకు చెందిన కుల సంఘాలు, ఆయా కులాల సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశంలో తమ వాదాన్ని బలంగా వినిపించారు. దీంతో అధికార పార్టీలో ప్రెస్ మీట్ లు పెట్టి చెప్పించే స్థాయికి చేరిందంటే ఇంటిలిజెన్స్ వర్గాలు అధికార పార్టీకి సమాచారాన్ని బలంగా పంపారని తెలుస్తుంది. . గజ్వేల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యమైన గజ్వేల్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అధికార పార్టీ పై ఎలాంటి విమర్శలు చేయలేకపోయినా అధికార పార్టీలో మాత్రం కదిలిక వచ్చింది. బీసీలకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్థానిక నాయకులు చెప్పుకొచ్చారు. పదవులు ఉన్నప్పుడు బీసీ రాగం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఇది వాస్తవం పదవులు ఉన్నప్పుడు ఏ ఉద్యమం, ఏ రాగాలు బయటకు రావు. ఇది గజ్వేల్ బీసీ కులాల ఐక్యవేదిక కమిటీ ఒకటే కాదు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కూడా కారణం ఏమిటో అధికార పార్టీ నాయకులకు చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి నాయకుడికి పదవి, హౌదా లేనప్పుడు ఏదో ఒకటి ముందుకు వేసుకుంటారు. అందులో నుండే తెలంగాణ రాష్ట్ర సమితి అవర్భవించిందని గజ్వేల్ బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు అంటున్నారు. బీసీ కులాలకు రావాల్సిన రిజర్వేషన్ల ప్రకారం తమాషా ప్రకారం చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ,ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని ఇక్కడినుండే ప్రారంభించాలని ముఖ్యంగా నియోజకవర్గంలో బలోపేతం చేసిన తర్వాత బయట ప్రాంతాలపై దష్టి పెట్టాలని స్థానిక బీసీ కులాల ఐక్యవేదిక నిర్ణయించుకుంది. మూడు నెలలుగా జరుగుతున్న కార్యక్రమాలో ఎక్కడ కూడా అధికార పార్టీపై ఇతర పార్టీలపై విమర్శలు చేయలేదు. కేవలం బీసీలకు జరుగుతున్న అన్యాయంపైనే చర్చించారు. కొందరు అగ్రవర్ణాలు కావాలని బీసీ కులాల ఐక్యవేదికపై అధికార పార్టీ తో విమర్శలు చేయించినట్లు వారు పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం లో రెండు లక్షల 70 వేల ఓట్లు ఉండగా ఇందులో బీసీలు 1,50,000 ఉన్నాయని వారికి గుర్తు చేశారు. చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ లో జరుగుతున్న బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సభలు సమావేశాలు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రముగా జరుగుతున్న బీసీల ఉద్యమం పై ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు సమాచార తెలుసుకుంటున్నాయి. నియోజకవర్గంలోని 177 గ్రామాల నుండి ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన అంటే బీసీ నినాదం ఎంతవరకు వెళ్లిందో వేరే చెప్పనక్కర్లేదు. అవసరమైతే పార్టీలో కూడా రాజీనామాలు చేసి రంగంలో దిగేందుకు ముఖ్య నేతలు అంతా నియోజకవర్గంలో సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో జడ్పీటీసీలు ,ఎంపీపీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు వివిధ హౌదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అవసరమైతే రాజీనామాలు చేద్దామని చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా గజ్వేల్ లో నిర్వహించిన బీసీ కులాల ఐక్యవేదిక కార్యక్రమాలు అధికార పార్టీలో కదిలికల తెచ్చాయి.