తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ గర్జన

– రిజర్వేషన్ల అమలు, ఇతర హామీలపై పోరుబాట
– ఇందిరా పార్క్‌ వద్ద ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలనీ, స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల సంఘాలు, వృత్తి సంఘాలతో పాటు విద్యార్థి, యవజన, మహిళా సంఘాలు ఈ సభలో పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌ వేదికగా స్పందించారు ఎన్నికల సమయంలో బీసీలకిచ్చిన హామీలను కాంగ్రెస్‌ విస్మరించిందని విమర్శించారు. ”కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోంది. బీసీలను రేవంత్‌ సర్కార్‌ అడుగడున దగా చేసింది. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా బీసీల హక్కుల సాధనకై చేపట్టిన మహసభను విజయవంతం చేయాలి” అని కవిత పిలుపునిచ్చారు.