– ఐఓఏకు రూ.8.5 కోట్లు అందజేత
– వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి జై షా
ముంబయి : ప్రపంచ అత్యంత ధనిక క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత ఒలింపియన్లకు ఆర్థికంగా మద్దతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడే భారత అథ్లెట్ల కోసం బీసీసీఐ రూ.8.5 కోట్ల నిధులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు అందజేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. పారిస్ ఒలింపిక్స్‌లో పతక వేటకు భారత ఒలింపిక్ సంఘానికి బీసీసీఐ రూ.8.5 కోట్లు అందజేస్తుంది. ఒలింపిక్స్ పతక వేటలో నిలిచిన ప్రతి ఒక్క భారత క్రీడాకారుడికి శుభాకాంక్షలు. భారత్ గర్వపడే ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను’ అని జై షా ట్వీట్ చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఈ సారి 117 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఇందులో 70 మంది అథెట్లు పురుషులు కాగా.. 47 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు జులై 26న జరుగనున్నాయి. కానీ రగ్బీ 7, ఫుట్‌బాల్, ఆర్చరీ వంటి క్రీడాంశాల్లో ప్రాథమిక రౌండ్ మ్యాచులు ముందుగానే ఆరంభం కానున్నాయి. పారిస్‌లో భారత ఒలింపిక్ పతక వేట జులై 25 నుంచే ఆరంభం కానుంది. ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్స్‌లో భారత ఆర్చర్లు బరిలో నిలువనున్నారు. ఆగస్టు 11న పారిస్ ఒలింపిక్స్ పోటీలకు చివరి రోజు. మహిళల రెజ్లింగ్ పతక ఈవెంట్ సైతం అదే రోజు ఉండటంతో భారత్ బోణీతో, అదిరే ముగింపు కోసం రంగం సిద్ధం చేసుకుంది.