స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..

– ఆ చట్ట సవరణ బిల్లుల్లో ఆ అంశమేదీ..? : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. పురపాలక, జీహెచ్‌ఎంసీ, పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని చెప్పారు. మూడు బిల్లులకు బీఆర్‌ఎస్‌ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. గురువారం అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. తమ సవరణలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అవసరమైతే సభలో డివిజన్‌కు కూడా పట్టుబడతామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నవంబర్‌లోగా కులగణన పూర్తి చేస్తామని చెప్పిందన్నారు. కులగణనపై తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమేనన్నారు.
ఎడ్ల బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలురైతుల సమస్యలు పరిష్కరించాలని నిరనస
రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం ఎడ్లబండిపై హాజరయ్యారు. ఎమెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకు ఎడ్ల బండిపై వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయమే లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడు తోందన్నారు. అర్హులైన రైతులకు రుణమాఫీ నిధులు మంజూరు చేయాలని కోరారు. రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలపై సర్కార్‌కు కనువిప్పు కలగాలనే తాము ఎడ్ల బండిపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యామని చెప్పారు.