– బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలంతా ఏకమై ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందిందనీ, కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా కామారెడ్డి విజయభేరి బహిరంగసభలో బీసీ డిక్లరేషన్‌ను ఆ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ డిక్లరేషన్ ప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేపట్టి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నిలను నిర్వహిస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బడ్జెట్‌లో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయిస్తామనీ,ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిందన్నారు. కానీ..వాటి గురించి కాంగ్రెస్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే బీసీలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీసీ జనసభ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 22న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు,సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.25న అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తామనీ, వచ్చేనెల 8న చలో ఇందిపార్కు కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని చెప్పారు.15న సచివాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాగేందర్, సూర్య, మేకల కృష్ణ, సంతోష్, మధు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.