బీ అలర్ట్‌

– ఉత్తర తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసిన డీజీపీ
– పోలీసుల అనుమతి లేనిదే మారుమూల ప్రాంతాలకు వెళ్లొద్దు
– ప్రజాప్రతినిధులకు అధికారుల సూచనలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ అప్రమత్తం చేశారు. జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన కారణంగా ప్రతీకార చర్యలకు పాల్పడే ప్రమాదమున్నదనీ, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా మెలగాలని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. ములుగుతో పాటు, ఉత్తర తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ పోలీసుల గస్తీని విస్తృతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతంలో సాయుధ గ్రేహౌండ్స్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించి కూంబింగ్‌ ఆపరేషన్‌ను కొనసాగించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఇదిలాఉంటే, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు పర్యటించే ముందు పోలీసులకు సమాచారమిచ్చి వెళ్లాలని కూడా ఆయా జిల్లాల ఎస్పీలు సూచించారు. కాగా, ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తాజా పరిస్థితిని ఇంటెలిజెన్స్‌, ఎస్‌ఐబీ ఉన్నతాధికారులతో పాటు రీజియన్‌ ఐజీలతో డీజీపీ జితేందర్‌ మాట్లాడి.. పరిస్థితిని సమీక్షించారు. అలాగే, గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ ఉన్నతాధికారులు ఉత్తర తెలంగాణలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, మావోయిస్టుల కదలికలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 70 మందికి పైగా మావోయిస్టులు మరణించటం, మరోవైపు రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకోవటంతో రీజియన్‌ ఐజీలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఎస్పీలు అప్రమత్తంగా మెలగాలనీ, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించినట్టు తెలిసింది.