సీఎంల గోల తర్వాతగానీ…బీ అలర్ట్‌

‘ఆలూ లేదు… సూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నడంట’ ఎన్కటికి ఒకడు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల తీరు గట్లనే ఉన్నది. ‘ఐక్యమత్యమే మహాబలం’ అని కర్నాటకలో కాంగ్రెస్‌ నేతలు నమ్మారు. ఏడాదిన్నరగా నియోజకవర్గాల్లోనే ఎక్కడిక్కడ పాగా వేశారు. నేతలంతా ఒక్కమాటపై నిలబడి అధికారంలోకి తీసుకొచ్చారు. గిది మాత్రం ఇక్కడి కాంగ్రెస్‌ నేతల బుర్రకెక్కడం లేదు. పైగా, కర్నాటకలో అధికారంలోకి వచ్చినం… తెలంగాణ లోనూ సానుకూల పవనాలు వీస్తున్నయని సంకలు గుద్దుకుంటున్నారు. అప్పుడే అధికారంలోకి వచ్చినట్టు… తమకు తామే సీఎం అయినట్టు అనుచరులతో జేజేలు కొట్టించుకుంటూ పగటి కలలు కంటున్నరు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల టైం కూడా లేదు నియోజకవర్గంలో రోజూ తిరుగుతూ జనంలో ఉండాలనే సోయినే మరిచారు. దశాబ్దకాలంగా పక్కనబెట్టారు… ఈసారి ప్రజలే తమకు ఓట్లేస్తారనే భ్రమల్లో మునిగి తేలుతున్నరు. ఒకరిద్దరు ముఖ్యనేతలు యాత్రలు చేస్తున్నా ఎవరికవారే యమునా తీరే అన్నట్టుగా అవి కొనసాగుతున్నాయి. జనమేమో వీళ్లు ఇక మారరు బై అనుకుంటున్నరు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఓడించేటందుకు వేరే వాళ్లు అవసరం లేదు… ఆ పార్టీ అభ్యర్థులను వాళ్లే ఓడించుకుంటరని బాహాటంగానే చెప్పుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు అలర్ట్‌ అయ్యి జనంలో మెదలాడకపోతే… ఆశలు అడియాశలై… పదవులకు మరో ఐదేండ్లు దూరమై… అని పాట పాడుకోవాల్సిందే. సీఎంల గోల తర్వాతగానీ కలిసి పనిచేయండి కాంగ్రెస్‌ నేతల్లారా. బీ అలర్ట్‌.
– అచ్చిన ప్రశాంత్‌