సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి– అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
వర్షాకాల సీజనల్‌ వ్యాధుల నియంత్రణ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) దీపక్‌ తివారి అన్నారు. శనివారం ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా. రవీంద్ర నాయక్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతిలతో కలిసి వ్యాధుల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వచ్చే 4 నాలుగు నెలల కాలం చాలా కీలకమైనవని, వైద్య సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. వర్షాలు, వరదలు వచ్చే సమయంలో కలుషితమైన నీటిని తాగకుండా కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగే విధంగా ప్రజలకు తెలియజేయాలని, ప్రతి శుక్రవారం గ్రామాలలో డ్రై డే నిర్వహించి నిల్వ నీటిని తొలగించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచినీటి ట్యాంకులు, చేతి పంపులు, బావులలో క్లోరినేషన్‌ చేపట్టాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆయిల్‌ బాల్స్‌, పిచికారి చేయాలని తెలిపారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మలేరియా, డయేరియా, ఫైలేరియా, ఇతర విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా నివారించాలన్నారు. బాధితులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన మందులను ఆశ, ఆరోగ్య కార్యకర్తల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సురేందర్‌, ఉమర్‌ హుస్సేన్‌, డిప్యూటి డీఎంహెచ్‌ఓ సుధాకర్‌, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.