నవతెలంగాణ-నస్పూర్
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాదులైన డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, అంటు వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రత్యేక వైద్య నిపుణులు, 23 ఆస్పత్రుల వైద్యులతో సమీక్ష నిర్వహించి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే జ్వర బాధితుల వివరాలు రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేసి ప్రతి రోజు వివరాలను జిల్లా కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. డెంగ్యూపై తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, టి-డయాగ్నొస్టిక్ హబ్లలో ఎలిసా పరీక్ష నిర్వహించిన తరువాతనే డెంగ్యూగా నిర్ధారణ చేయాలని తెలిపారు. ప్రయివేట్ ఆసుపత్రులలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు-2010 ప్రకారం ఆస్పత్రిలో ఉండవలసిన పరికరాలు, సౌకర్యాలు కల్పించడంతో పాటు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వైద్యుల వివరాలు, రుసుము వివరాలు, ఆస్పత్రిలో అందించే వైద్య సేవల వివరాలు అందరికీ తెలిసే విధంగా ప్రదర్శించాలని, స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ నిరోధక చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీలు చేయరాదని ప్రజలకు అర్థమయ్యే విధంగా గోడిపతులు, ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఒక వేళ ఆ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా చట్ట రీత్యా నేరమని, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు వైద్య సేవల కొరకు వైద్యులను సంప్రదించిన సమయంలో వారు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలని, వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందించినట్లయితే తీసుకోవలసిన ముందస్తు చర్యలపై అప్రమత్తంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, డీడీఎం ప్రవళిక, వైద్యులు పాల్గొన్నారు.