సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

– పెద్దవూర మండలం పీ హెచ్ సీ వైద్యులు.. నగేష్ తో ఇంటర్వ్యూ
నవతెలంగాణ – పెద్దవూర
వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచివుంది. ఈ నేపథ్యంలో వ్యాధుల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలగురించి పెద్దవూర పీహెచ్‌సీ డాక్టర్‌ నగేష్ వివరించారు.
నవతెలంగాణ : ప్రస్తుతం ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డాక్టర్‌ : వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో అవగాహన కల్పించాము  తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించడంతో పాటు సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగ్యూ, డైయేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించాం.గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మురుగు నీటి గుంతలు, కాల్వల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నాం.
నవతెలంగాణ : దవాఖానలో ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
డాక్టర్‌ : ఇద్దరు స్టాఫ్‌నర్సులతోపాటు పూర్తి స్థాయి సిబ్బందితో నిరంతర సేవలను అందిస్తున్నాం. వ్యాధులకు సంబందించిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం.
నవతెలంగాణ : పాము కాటుకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందా?
డాక్టర్‌ : ప్రత్యేకించి ప్రభుత్వం పాము కాటుకు గురైన వారికి ఏఎస్‌వీ, కుక్క కాటుకు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. నాటు వైద్యం జోలికి పోకుండా పాము కాటుకు గురైన వారిని నేరుగా దవాఖానకు తరలించాలి.
నవతెలంగాణ : కాన్పుల కోసం వచ్చేవారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి…
డాక్టర్‌: ప్రభుత్వ దవాఖానాలో కాన్పులు చేయించుకునే తల్లీ బిడ్డల సంక్షేమంకోసం ఆడ బిడ్డ పుడితే రూ. 13 వేలు, మగ బిడ్డ పుడితే రూ. 12 వేలు లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది.
నవతెలంగాణ: సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి?
డాక్టర్ :వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముందస్తు జాగ్రత్తలతో వ్యాధులను కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ముందస్తుగానే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ చేయడం, ఏమైనా వ్యాధి లక్షణాలు కన్పిస్తే త్వరితగతిన చికిత్స అందించడం వంటివి చేస్తున్నాం. వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉన్నాము.
నవతెలంగాణ : వ్యాధుల నియంత్రణ కార్యాచరణ ఎలా ఉంది?
డాక్టర్ : ఈ సీజన్‌లో ముఖ్యంగా కలుషితాహారం, కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా(అతిసార) ప్రబలే అవకాశం ఉండడంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందజేస్తున్నారు. స్థానిక వైద్య కేంద్రం లో అవసరమైనన్ని ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం.
నవతెలంగాణ : వ్యాధుల తీవ్రతపై పల్లెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మాటేమిటి?
డాక్టర్ : ఒకప్పుడు వానాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాలు, మారుమూల ఆవాసాల్లోని ప్రజానీకం సీజనల్‌ వ్యాధులతో అల్లాడిపోయేవారు. రోజులకు రోజులు మంచం పట్టే పరిస్థితులుండేవి. పెద్దసంఖ్యలో క్యాంపులు ఏర్పాటుచేసి వైద్యం అందించాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు. ప్రభుత్వ వైద్యం పల్లె ప్రజలకు చేరువైంది. ఆశావర్కర్లు ఇంటింటికి వెళ్లి మందులను అందజేస్తున్నారు.
నవతెలంగాణ : వ్యాధుల పట్ల ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి
డాక్టర్ : ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పరిశుభ్రతను పాటించాలి. పరిశుభ్రమైన ఆహారంతోపాటు కాచి వడబోసిన నీటినే తాగాలి.  ఏవైనా టెస్టులు అవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చేయించుకునే అవకాశం ఉంది. సబ్‌ సెంటర్లలో సంబంధిత నమూనాలను ఇస్తే పరీక్షల నిమిత్తం వాటిని జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానకు పంపించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత అవసరమైన మందులను అందజేస్తారు.
నవతెలంగాణ : ఈ సీజన్‌లో ఏయే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నివారణ చర్యలేమిటి?
డాక్టర్ : మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఈ తరహా వ్యాధులు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది అంటు వ్యాధులకు కారణమవుతున్నాయి.దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.