మిచౌంగ్‌ తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలి

– తాసిల్దార్ తోట రవీందర్
నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని ప్రజలు మిచౌంగ్‌ తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలని స్థానిక తహసీల్దార్ తోట రవీందర్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్‌ ముప్పు పొంచి ఉండటంతో రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రజలు ముందుగానే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అధికారుల ఆదేశాల ప్రకారం గ్రామ, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు పంచా యతీ హెడ్‌ క్వార్టర్స్‌లోనే ఉండి పర్యవేక్షించాలని అన్నారు. తడిసిన విద్యుత్ స్తంభాలను తాకరాదని, మండలంలోని చేపలు పట్టేవారు వెళ్ళరాదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమొస్తేనే బయటికి రావాలి తప్ప, లేకపోతే బయటకి రావద్దని సూచించారు. ముఖ్యంగా మండలంలోని జంపన్నవాగు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల న్నారు. తుఫాన్‌ వల్ల విద్యుత్‌, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే సమాచారం అందించాలని తెలిపారు. గ్రామాలలో నీరు నిల్వ ఉన్నచోట బ్లీచింగ్‌ పౌడర్‌, ఓహెచ్‌ ఎస్‌ఆర్‌ లార్వాలు అభివృద్ధి కాకుండా చల్లాలని అన్నారు. తుఫాన్‌ వల్ల ప్రజలకు ఎటువంటి ఆరోగ్యం బాగా లేకపోయినా మెడికల్‌క్యాంపు నిర్వహించాలని పేర్కొన్నారు.