సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

– రామక్కపేట టిఎస్డబ్లఆర్  జూ.. కళాశాలలో అవగాహన 
– దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ 
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతోపాటు విద్యార్థినీ విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే సమస్యల బారిన పడకుండా ఉండాలని దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ  సూచించారు. శనివారం  దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ (టిఎస్డబుల్ ఆర్  జూ.. కాలేజ్) విద్యార్థినీ విద్యార్థులకు మహిళలకు కల్పించిన రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశా లపై  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా  సీఐ మున్నూరు కృష్ణ మీడియాతో  మాట్లాడుతూ సీపీ ఆదేశాల మేరకు విద్యార్థులకు అన్ని పాఠశాలల్లో ఆయా అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సమాజంలో బాల్య వివాహాలు జరగవద్దని, వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించామన్నారు. అదేవిధంగా ఎవరైనా విద్యార్థినిలు, యువతులు, మహిళలు ఈవ్ టీజింగు, బ్యాడ్ టచ్ కు వంటి వాటికి గురైతే వెంటనే షీ టీమ్ లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేటి కాలంలో సైబర్ నేరగాళ్ల భారిన పడకుండా  జాగ్రత్తలు వహించాలన్నారు. వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణకై ప్రభుత్వం షీ టీమ్ ను ఏర్పాటు చేసి, అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే విధానాలను తెలిసి ఉండాలన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా, ఏడిపించినా వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట షీ టీమ్ వాట్సప్ నెంబర్ 87126 67343, స్నేహిత మహిళా సపోర్ట్ నెంబర్ 94946 | 39498, మహిళా పోలీస్ స్టేషన్ 87126 67435 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్  ఉషా కిరణ్, దుబ్బాక ప్రొబిషనర్ ఎస్ఐ దామోదర్, ఎస్ ఐ గంగరాజు, ఎఎస్ఐలు వహిద్ పాషా, కృష్ణ, అధ్యాపకులు,సిద్దిపేట షీ టీమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు