ప్రైవేటు విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలి 

– ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేస్తే ప్రైవేట్ విత్తన కపెనీలపై కఠిన చర్యలు
– రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
రైతులు ప్రైవేట్ విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి సోమవారం అన్నారు. మండల కేంద్రంలోని రైతుల వరి పొలాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి సోమవారం పరిశీలించారు. జక్రాన్ పల్లి రైతుల ఫిర్యాదు మేరకు జక్రం పెళ్లి మండల కేంద్రంలోని మహేంద్ర సీడ్ కంపెనీ ఇచ్చిన వరి పొలాలను పరిశీలించారు. మండలంలో మొత్తము 500 ఎకరాలకు సరిపడా వరి విత్తనాలు మహేంద్ర సీడ్ కంపెనీ సరఫరా చేయడంతో విత్తనం ఫెయిల్ అయి పొట్ట దశలో పొట్ట బయటకు రాకుండా ఆగిపోయింది. అదేవిధంగా మరి గొలక బయట పడిన తర్వాత కంకినల్లి రోగం సుడిదోమ పురుగులు ఆశించడంతో పంట రాలేక రైతులు దిగాలుగా ఉన్నారని అన్వేష్ రెడ్డి వెంటనే అగ్రికల్చర్ కమిషనర్ కు మాట్లాడి మంగళవారం సైంటిస్టులను జక్రాంపల్లి మండల కేంద్రానికి పంపించి మహేంద్ర సీడ్ కంపెనీ ఇచ్చిన విత్తనంతో వేసిన వరి పొలాలను పరిశీలించి వివరాలు తెలియజేయాలని కోరారు. అనంతరం మహేంద్ర సీడ్ కంపెనీ మేనేజర్ తో ఫోన్లో మాట్లాడడంతో మేనేజర్ వాతావరణ పరిస్థితుల వల్ల ఆ విధంగా జరిగిందని తెలిపారని అవినాష్ రెడ్డి అన్నారు. అనంతరం అవినాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..ప్రైవేట్ విత్తన కంపెనీలకు హెచ్చరిస్తూ ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేయవద్దని అన్నారు.
రైతులకు తక్కువ కాలం అంటే 110 రోజుల వ్యవధిలో పండే వరి రకాలను ఇచ్చి మోసం చేయడంతో అధిక రోగాలు రావడంతో రైతులు దానిని గమనించలేక పంట నష్టపోతున్నారని , ఎన్ని పురుగు మందులు స్ప్రే చేసిన పంట చేతికి వచ్చి పరిస్థితి లేదని అన్నారు. సైన్స్టిట్ల రిపోర్టు రాగానే మహీంద్రా సీడ్ కంపెనీ పై మరియు ఇతర ప్రైవేటు కంపెనీలపై తగు కఠిన చర్యలు తీసుకొని రైతులకు నష్ట పరిహారము అందిస్తామని తెలియజేశారు. మండల కేంద్రంలోని నోముల ముత్యం, రెక్కల భోజ రెడ్డి వరి పొలాలను పరిశీలించారు. ఇకనైనా రైతులు ప్రైవేట్ కంపెనీలను నమ్మకుండా మన సొసైటీ పరిధిలో తెలంగాణ సీడ్ కంపెనీ ద్వారా వరి విత్తనాలను కొనుగోలు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరి పంటలు పండించుకోవాలని సూచించారు. రోగనిరోధక శక్తిని తట్టుకోలేని సన్న రకాలను మహేంద్ర సీడ్ కంపెనీ అందజేసి రైతులను మోసం చేస్తుందన్నారు. మహేంద్ర కంపెనీ వారు సొంత వెరైటీని ఇచ్చారని, సర్టిఫై లేని విత్తనం ఇచ్చారని అన్నారు. విత్తన చట్టంలో చాలా తప్పులు ఉన్నాయని , రైతులను ఆదుకుని దిశగా చట్టం ఉండాలన్నారు, విత్తన   చట్టంలో తయారు చేసే వారె సర్టిఫై చేసే అధికారం ఉందని , విత్తనా చట్టంలో మార్పు వస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. సైంటిస్టులు పరిశీలించి మహీంద్రా సీడ్ విత్తనాల వల్ల లోపం ఉందని తెలిస్తే ప్రభుత్వం పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులకు మేలు జరుగుతుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే విత్తనాలన్నీ యూనివర్సిటీ ద్వారా తయారు చేసిన  కేఎన్ఆర్, ఆర్ఎన్ఆర్ మంచి రకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంత వర్షాలు పడిన వాటికి ఎటువంటి రోగాలు రాలేవని అన్నారు. మంచి విత్తనాలను పంపించేస్తామన్నారు. ప్రభుత్వ కార్పొరేషన్ విత్తనాలను వాడాలని రైతులను కోరారు. ఏడియే ప్రదీప్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి దేవిక, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, బ్రాహ్మణపల్లి సింగిల్ విండో చైర్మన్ కాట్పల్లి నర్సారెడ్డి, జక్రాన్ పల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్, జక్రాన్ పల్లి మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ రుపాల గంగారెడ్డి, నిజాంబాద్ రూరల్ నియోజకవర్గ యువజన నాయకుడు వినోద్,  సంజయ్   రిక్కల సురేష్, జైడి మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంతరావు, నారాయణపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేందర్, నరేడ్ల సాయి రెడ్డి, జక్రాన్ పల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.