ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ దేన్నెనా సాధించగలమన్న నమ్మకం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో అయినా వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలరు. కొత్త విషయాలు నేర్చుకోగలరు. ఏదైనా ఒక ప్రాజెక్ట్‌కి మిమ్మల్ని నాయకత్వం వహించమని అడిగినప్పుడు మీలో ఆ సామర్థ్యం లేవని బాధడుతున్నారా.. ఈ భయం మంచిదే అంటున్నారు మానసిక నిపుణులు. మీ సామర్థ్యాలు పెంచుకోవడానికి, వ్యక్తిగా ఎదగడానికి ఈ భయం తోడ్పడుతుంది. అయితే ఇదే నిరంతరంగా కొనసాగితే అది మీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఒక్కసారి మనలో విశ్వాసం పెరిగితే మనం చేయలేమన్న భావన తుడిచిపెట్టుకుపోతుంది. మరి అలాంటి ఆత్మ విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…
జీవితం పోటీ కాదు. ఎవరి జీవితాలు వారివి. ఒకరి స్థితిగతులు ఎలా ఉంటాయనేది వారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇతరులతో పోల్చి చూసుకోవడం మానేయాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుందంట. దాని వల్ల వ్యక్తులు తమను తాము తక్కువ చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని గత పరిశోధనల్లో తేలింది.
మంచి వ్యక్తులతో స్నేహం
మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో గుర్తిస్తే మనమేంటో అర్థమవుతుంది. మంచి వ్యక్తులు, సానుకూల దృక్పథంతో ఉండేవారు, మన మంచిని కోరే వారితో సన్నిహితంగా మెలగడం అలవాటు చేసుకోవాలి. వారి ప్రభావం మనపై కొంతైనా పడుతుంది. కాబట్టి వారి మాటలు, చర్యలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఎవరైనా చెడువైపు లాగాలని ప్రయత్నిస్తే వారితో స్నేహానికి గుడ్‌బై చెప్పేయండి.
ఆరోగ్యం జాగ్రత్త
ఆరోగ్యం బాగుంటే కొండంత బలం. దీని వల్ల ఆత్మ విశ్వాసం కూడా లభిస్తుంది. నిత్యం హుషారుగా ఉండేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటాన్ని గమనించొచ్చు. కాబట్టి ప్రతిరోజు వ్యాయమం చేస్తూ పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండి. దీని వల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
తప్పులు మన్నించుకోండి
మీ వల్ల ఓ పొరపాటు జరిగితే దాన్నే తలచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. మీ తప్పులను మీరే క్షమించుకోండి. మరోసారి అలా జరక్కుండా చూసుకోవాలని బలంగా సంకల్పించుకోండి. దీని వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఆ మాటలు వద్దు
నా వల్ల కాదు, అసలు చేయగలనా?, ఇది అసాధ్యం వంటి మాటలు మీ నోటి వెంట రాకుండా చూసుకోండి. అలాంటి మాటలు మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. దేన్నైనా నేను సాధించగలను అనే భావనతో ఉండాలి. నేను చేయగలను, సాధించగలను అని మీకు మీరే తరచూ చెప్పుకుంటూ ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
సక్సెస్ పోస్టర్..
మీ బెడ్‌రూమ్‌లో మీ చిన్నప్పటి నుండి ప్రస్తుతం వరకూ మీరు సక్సెస్ అయిన విషయాలు, విజయాలను పోస్టర్‌లా క్రియేట్ చేసి పెట్టండి. రన్నింగ్ రేసులో విన్నింగ్, స్కాలర్ షిప్ విన్ అవ్వడం, ఫెయిల్ అవుతారనుకున్న సమయంలో సి గ్రేడ్ రావడం ఇలా ఏవైనా మీరు హ్యాపీగా ఫీల్ అయిన విజయాలన్నింటిని పోస్ట్‌ర్‌లా అంటించి పెట్టుకోండి. రోజూ వీటిని చూడడం వల్ల మీకు ఓ పాజిటివిటీ వస్తుంది. ఇప్పటివరకూ మీరు సాధించిన విజయాలను ఒక చోట రాసుకోండి. దీని వల్ల కూడా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. బాధలో ఉన్నప్పుడు వీటిని చదువుతూ ఉండండి.
నమ్మకం…
అందరం తప్పులు చేస్తాం. అలా తప్పులు చేయడం వల్లే చాలా విషయాలను నేర్చుకోగలుగుతాం. కాబట్టి.. కొన్ని మార్చుకోలేని వాటిని అంగీకరించి వాటిని ఎలా పాజిటివిటీగా మార్చుకోగలరో మార్చుకుని సక్సెస్ అవ్వండి.
లక్ష్యాలను విడదీయండి..
కొన్నిసార్లు పెద్ద లక్ష్యాను చూస్తే వాటిని చేరుకోండా అసాధ్యం అనిపిస్తుంది. కానీ మీరు దానిని రోజుకి కొంత చేసి చూడండి.. అంటే విభజించండి. ఇలా చేయడం వల్ల మీరు గడువుల ప్రకారం మీరు లక్ష్యాన్ని సాధిస్తారు.
మనసుని క్లీన్ చేసుకోండి…
మనపై మనకి డౌట్ ఉండడం, భయం, ఆందోళన… ఇలాంటి వన్నీ మనల్ని వెనక్కి నెట్టెసేవే. వీటన్నింటిని ఎప్పటికప్పుడు హార్ట్ ఫుల్‌గా క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీలో పాజిటీవిటి పెరుగుతుంది. వీటన్నింటి స్థానంలో చేయాలన్న ఆశ, ఆనందం, సానుకూలతలను నింపితే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
భయాలను ఎదుర్కోండి
ప్రతి మనిషికి భయాలు ఉంటాయి. కానీ, ఆ భయాలను జయిస్తేనే విజయాలు దక్కుతాయి. సవాలు ఎదురైతే భయపడి దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయొద్దు. సవాల్‌ణు ఎదుర్కోండి. తొలి ప్రయత్నంలో ఓడినా భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. దీంతో భవిష్యత్‌లో విజయాలను అందుకునే ఆస్కారముంది.