ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి

Navatelangana,Adilabad,Telugu News,Telangana,– మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్‌
నవతెలంగాణ-తాండూర్‌
ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్‌ తెలిపారు. బుధవారం తాండూర్‌ మాదారం పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను తనిఖీ చేసి పోలీసులకు తగు సూచనలు చేశారు. కేసులపై పోలీస్‌స్టేషన్లకు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా ప్రవర్తించలన్నారు. తాండూర్‌ మండలంలో ముఖ్యంగా భూ వివాదాలు, కుటుంబ కలహాల కేసులు సహజంగా కనిపిస్తున్నాయన్నారు. వీటిని నియంత్రించడానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు, అలాగే పట్టణాలలో కూడా కాలనీల నిద్రల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మండలాలలో భూములను కొందరు వ్యక్తులు ఒకరి వద్ద బయాన తీసుకొని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి వారి పట్ల పోలీసు శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. అలాగే పట్టణాలలో ఒకే ప్లాట్లను ఇరువురు వ్యక్తులకు అమ్మి మోసాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవడమే కాక వారిపై రౌడీ షీట్‌ కేసులు చేస్తామన్నారు. నేరాల నియంత్రణకు గ్రామాల్లో ప్రజలు, వ్యాపార సముదాయాల వారు కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాలను నియంత్రించవచ్చు నన్నారు. అనంతరం మాదారం పోలీస్‌స్టేషన్‌ గ్రౌండ్‌ను పరిశీలించి దానికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీసీపీ వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ తాండూర్‌ సీఐ కె కుమారస్వామి, ఎస్సై సిహెచ్‌ కిరణ్‌ కుమార్‌, మాదారం ఎస్‌ఐ తిరుమలరావు ఉన్నారు.