రక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలి

Be prepared for defensive measures– సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-నస్పూర్‌
భారీ వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు రక్షణ చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఆమ్రాపాలి ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో భారీ వర్షాలు, నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం, ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి దరఖాస్తుల పరిశీలన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షపాతం జోన్లలో అత్యవసరాల మేరకు రక్షణ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్‌ మళ్ళించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 23, 24 తేదీలలో జిల్లా స్థాయిలో నూతన చట్టం గురించి ప్రజలు, మేధావులు, నిపుణలకు వివరించి వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలని, వాటిని రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించాలని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ నిర్వహణ కొరకు జిల్లా స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయి అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లతో బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించాలని, దరఖాస్తులు తిరస్కరించబడినట్లయితే సదరు కారణాన్ని రిమార్కు కాలములో స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు. దీనికి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, గ్రామపంచాయతీ స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధరణి పోర్టల్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, నివాస గృహాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, మున్సిపల్‌ కమీషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.