ఎన్నికలకు సన్నద్ధంగా ఉండండి :డీజీపీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
వచ్చే శాసనసభ ఎన్నికల బందోబస్తుకు తమ యంత్రాంగాలను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం పైఅధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ రాబోతున్నదని ఆయన అన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఏ మేరకు సిద్ధంగా ఉన్నదనేది పరిశీలించటానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరఫున ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గం అక్టోబర్‌ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఈ ఉన్నతస్థాయి కమిటీ పర్యటించి జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లతో సమావేశం కానున్నదని డీజీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో పకడ్బంధీ బందోబస్తు వ్యూహాలను రూపొందించుకొని శాంతియుతంగా ఎన్నికల పర్వాన్ని నిర్వహించటానికి తాము తీసుకుంటున్న చర్యలను ప్రతినిధి వర్గానికి క్షుణ్ణంగా వివరించాలని ఆయన సూచించారు. అలాగే, తమకున్న ప్రస్తుత పోలీసు బలగాలను వివరిస్తూ అవసరమైన అదనపు బలగాల గురించి కూడా ప్రతినిధి వర్గానికి తెలియజేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి తాము తీసుకుంటున్న చర్యలను అవసరమైతే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇవ్వాలని ఆయన తెలిపారు. కాగా, గత రెండ్రోజులగా హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లతో పాటు ఇతర జిల్లాల్లో గణేశ్‌ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా నిర్వహించటం పట్ల పోలీసు అధికారులు మొదలుకొని సిబ్బందిని పేరు పేరునా అభినందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యంగా, పోలీసు శాఖలో కొత్తగా విధుల్లో చేరిన ఎస్పీలు మొదలుకొని ఇతర అధికారులు, సిబ్బంది వరకు వారికి లక్షలాది మందితో కూడిన గణేశ్‌ బందోబస్తు ఒక అనుభవం వంటిదని ఆయన అన్నారు. గణేశ్‌ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా నిర్వహించటానికి ప్రజలు అందించిన సహకారం కూడా ఎనలేనిదని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, టీఎస్‌ఎస్‌పీ అదనపు డీజీ స్వాతి లక్రా, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు కుమార్‌ జైన్‌, ఐజీ రమేశ్‌లు పాల్గొన్నారు.