– ప్రధానిపై ఫిర్యాదులకు స్పందించని ఈసీ
– 2019 నుండి 27 ఫిర్యాదులు అందజేసిన ప్రతిపక్షం
– ఒకే ఒక నోటీసుతో సరిపెట్టిన ఎన్నికల సంఘం
– అది కూడా బీజేపీ అధ్యక్షుడికే
– ప్రతిపక్ష నేతలకు మాత్రం తుమ్మినా, దగ్గినా నోటీసే
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ ఏ ఒక్క ఫిర్యాదు పైన చర్య తీసుకున్న దాఖలాలు లేవు. 2019 ఎన్నికల నుంచి ప్రతిపక్షాలు ఇప్పటి వరకూ ప్రధానిపై కనీసం 27 ఫిర్యాదులు అందజేశాయి. అయితే వీటిపై ఈసి నేటి వరకూ నిర్దిష్ట చర్యలు చేపట్టలేదు. విద్వేష ప్రసంగాలు, ఓట్ల కోసం సాయుధ దళాలను వాడుకోవడం, మతం పేరుతో ఓట్లు అడగడం, ర్యాలీలలో ప్రధానమంత్రి ప్రసంగాలను తయారు చేయడానికి మంత్రిత్వ శాఖలను ఉపయోగించుకోవడం వంటి ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి.
ప్రధానిపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ తొలిసారిగా ఈ నెల 25న స్పందించింది. ‘మీ స్టార్ క్యాంపెయినర్ ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉండవచ్చు’ అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసు పంపింది. కాంగ్రెస్, సీపీఐ (ఎం), సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీల ఫిర్యాదుల ఆధారంగా ఇచ్చిన ఈ నోటీసులో ప్రధాని పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను, మహిళల మంగళసూత్రాలను గుంజుకొని చొరబాటుదారులైన ముస్లింలకు పందేరం చేస్తుందంటూ రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో జరిగిన ర్యాలీలో ప్రధాని చేసిన వ్యాఖ్యపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. తన నోటీసుకు సోమవారం లోగా సమాధానం ఇవ్వాలని బీజేపీకి ఈసీ సూచించింది.
ఫిర్యాదుల చిట్టా
ప్రధానిపై ప్రతిపక్షాలు ఇచ్చిన 27 ఫిర్యాదులను ‘ది క్వియంట్’ పోర్టల్ విశ్లేషించింది. వీటిలో 12 ఫిర్యాదులు మతపరమైన ఉపన్యాసాలకు సంబంధించినవి. సాయుధ దళాల పేరు చెప్పి ఓట్లు అభ్యర్థించారంటూ 8 ఫిర్యాదులు అందించారు. రాజకీయ ప్రకటనలో ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకున్నారని ఓ ఫిర్యాదు అందజేశారు. మత ప్రాతిపదికన ఓట్లు అడిగారని, ఎన్నికల ప్రసంగాల కోసం ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను వాడుకున్నారని ఒక్కో ఫిర్యాదు చేశారు. ప్రచార సమయంలో ప్రధాని ప్రయాణించిన హెలికాప్టర్‌లో అనుమానాస్పద బ్లాక్‌బాక్స్ ఉందంటూ రెండు ఫిర్యాదులు అందజేశారు. ప్రచారంలో మైనర్లను వాడుకున్నారని, గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేశారని ఒక్కో ఫిర్యాదు ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. తాము ఇన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ ఒక్క దానిపై కూడా చర్య తీసుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
వారికి నోటీసులు ఇవ్వరేం?
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఠాక్రే) నేత ఉద్ధవ్ ఠాక్రేకు ఈ నెల 21న ఈసీ ఓ నోటీసు పంపింది. పార్టీ నూతన గీతం నుంచి ‘జై భవాని’, ‘హిందూ’ పదాలను తొలగించాలని సూచించింది. అందుకు ఉద్దవ్ నిరాకరించారు. కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘జై బజరంగ బలి’ అని నినాదం చేసి, ఆ తర్వాత ఓటు వేయాలని ఓటర్లకు ప్రధాని పిలుపు ఇచ్చారని, అయోధ్యలో ఉచితంగా బాలరాముడి దర్శనం చేసుకోవాలంటే బీజేపీకి ఓటేయాలని హోం మంత్రి అమిత్ షా చెప్పారని, మరి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సంవత్సరం కర్నాటక శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ప్రధాని హనుమాన్ పేరును ప్రస్తావించారంటూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వీటి పైన కూడా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నీరుకారిన ఈసీ స్వతంత్రత
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్వతంత్రతను ఉద్దేశపూర్వకంగానే నీరుకారుస్తోంది. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలోనే ప్రభుత్వ ఉద్దేశం తేటతెల్లమైంది. ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి, ఆ స్థానంలో ఓ కేంద్ర మంత్రిని నియమిస్తూ చట్టానికి సవరణలు చేశారు. కమిటీలో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించినప్పటికీ ఆయన మాట చెల్లుబాటు కాకుండా చేశారు. ప్రధానికి ఇష్టులైన వారే ఎన్నికల కమిషనర్లుగా నియమించబడడంతో పాలకపక్షం ఆడింది ఆట… పాడింది పాటగా సాగింది. అర్థం పర్థం లేని కారణాలతో ప్రతిపక్ష నేతలకు నోటీసులు జారీ చేయడం ప్రారంభమైంది. అదే అధికార పార్టీకి చెందిన వారు ఎంతలేసి మాటలంటున్నా పట్టించుకునే నాథుడే లేడు.
ప్రతిపక్షాలకే సుద్దులు
గత ఏడాది నవంబర్ 23న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు పంపింది. ప్రధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై నాయకులు ఆరోపణలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని సుద్దులు చెప్పింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని మోడీ ఆరోపణలు చేశారు. కర్నాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో బజరంగ్‌దళ్‌పై నిషేధం ప్రస్తావన ఉంది. ఈ నిషేధం హనుమంతుడిని బంధించడంతో సమానమని మోడీ వ్యాఖ్యానించారు. దీనిపై ఈసీ పెదవి విప్పలేదు. ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేసినందుకు అమ్‌ఆద్మీ పార్టీకి కూడా ఈసీ నోటీసులు పంపింది. కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ 2019లో ఆయన ప్రచారంపై ఈసీ 72 గంటల నిషేధం విధించింది.
ఏచూరి ఫిర్యాదుపై స్పందన లేదు
2019 మార్చి 27న సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఆకాశవాణి, దూరదర్శన్‌లో జాతినుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రకటనను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు ఉపగ్రహ నిరోధక క్షిపణిని విజయవంతంగా పరీక్షించారని ప్రధాని ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి ప్రకటనలను డీఆర్‌డీఓ వంటి సంబంధిత సంస్థలు ప్రకటిస్తుంటాయని, అయితే అందుకు భిన్నంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని ప్రకటించారని ఏచూరి తన లేఖలో ఫిర్యాదు చేశారు. పైగా ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రధానమంత్రి ప్రచార సమయంలో ఈ ప్రకటన చేశారని, ఇలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన తెలిపారు. అయితే ప్రధాని ప్రకటన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి రాదని ఈ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీ తేల్చేసింది. అయితే తన ఫిర్యాదును కేవలం ‘అధికార మీడియాను దుర్వినియోగం చేయడం’ అనే అంశానికే పరిమితం చేయడంపై ఏచూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఎన్నికల కమిషన్‌కు ఓ లేఖ కూడా రాశారు. అయితే దానిపై ఈసీ స్పందించలేదు.