
– చెడు వ్యసనాలకు భానిస కావద్దు ఎస్సై అభిలాష్
నవతెలంగాణ – కోహెడ
యువత గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిసకావద్దని ఎస్సై అభిలాష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కమీషనర్ ఆదేశాల మేరకు విద్యార్థిని విద్యార్థులకు మహిళల చట్టాలు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దశలో చెడు వ్యసనాలకు భానిసకాకుండా ఏకాగ్రతతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అపరిచిత వ్యక్తులు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే నూతన చట్టాలు మహిళల రక్షణకు అండగా నిలుస్తున్నాయన్నారు. చిరు తగాదాలకు వెళ్ళి జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. షీ టీమ్స్ ప్రాముఖ్యత, నిర్వహించే విధులు, ఫోక్సో చట్టాలు, బాల్య వివాహాలు, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, డయల్ 100 ప్రాముఖ్యతపై వివరించారు. విద్యార్థి దశ చాలా కీలకమని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడిరచిన వెంటనే డయల్ 100 కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వారి బాగోగులతో పాటు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జీ ప్రిన్సిపాల్ యాదగిరి, అధ్యాపకులు నరేష్, శ్రీనివాస్, రాజమౌళి, రాజేశ్వర్‌రెడ్డి, అశోక్, వెంకట్‌రెడ్డి, రజిత, నీరజ, సుజాత, కానిస్టేబుల్‌లు తదితరులు పాల్గొన్నారు.