దలాల్‌ స్ట్రీట్‌పై బేర్‌ పంజా

Bear Claw on Dalal Street– సెన్సెక్స్‌ 942 పాయింట్ల పతనం
– రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
– రిలయన్స్‌, బ్యాంకింగ్‌ షేర్ల దిగాలు
– అమెరికా ఎన్నికల ప్రభావం
– ఆల్‌టైం కనిష్టానికి రూపాయి
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోమారు కుప్పకూలాయి. రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ముందస్తు అప్రమత్తతో అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సోమవారం ఒక్క పూటలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 942 పాయింట్లు పతనమై.. మూడు నెలల కనిష్టానికి పడిపోగా.. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 1 శాతం క్షీణించి 24,000 పాయింట్ల దిగువకు జారింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువ చోటు చేసుకుంది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 941.88 పాయింట్లు లేదా 1.18 శాతం క్షీణించి 78,782కు దిగజారింది. ఇది ఆగస్టు 6 నాటి కనిష్ట స్థాయి. కాగా.. ఇంట్రాడేలో ఏకంగా 1,491 పాయింట్లు కోల్పోయి.. 78,232.60 కనిష్ట స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 309 పాయింట్ల నష్టంతో 23,995 వద్ద ముగిసింది.
ప్రధాన కారణాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరగనున్నాయి. దీంతో మదుపర్లు ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ఇదే ప్రభావం చూపించింది. మరోవైపు ఈ నెల 7న ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి. భౌగోళికంగా ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ముదురుతున్న సంకేతాలతో చమురు ధర 2 శాతం మేర పెరిగి 75 డాలర్లకు చేరడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.11 ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో వృద్థిపై అనుమానాలు పెరిగాయి. విదేశీ పోర్టుఫోలియో మదుపరులు భారీగా పెట్టుబడులను తరలించుకుపోవడం దలాల్‌ స్ట్రీట్‌పై మరింత ఒత్తిడిని పెంచింది. అక్టోబర్‌లో రూ.1,13,858 కోట్ల ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి.