– బోరుమన్న మదుపర్లు
– రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరి
– సెన్సెక్స్ 2200 పాయింట్ల పతనం
– అమెరికాలో మందగమనం భయాలు
– ఒత్తిడిలో ప్రపంచ మార్కెట్లు
ముంబయి : అమెరికాలో ఆర్థిక మందగమనం భయాలు ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించాయి. ఈ క్రమంలోనే సోమవారం భారత మార్కెట్లు భారీ నష్టాల పాలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2222 పాయింట్లు లేదా 2.74 శాతం పతనమై 78,768కు దిగజారింది. ఇంట్రాడేలో ఏకంగా 78,296 పాయింట్లు లేదా 3 శాతం విలువ కోల్పోయింది. ఒక్క పూటలోనే రూ.15.34 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. దీంతో బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్ల నుంచి రూ.441.82 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఏర్పడిన కుదుపునతో సాధారణ మదుపర్లు బోరుమన్నారు.బీఎస్‌ఈలో బాటలోనే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 662 పాయింట్లు లేదా 2.68 శాతం పతనమై 24,055 వద్ద ముగిసింది. నిఫ్టీ-50లో 45 స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో షేర్లు అత్యధికంగా 7 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ-30లో హిందుస్థాన్ యూనిలీవర్, నెస్ల్టే మినహా 28 స్టాక్స్ నేల చూపులు చూశాయి. నిఫ్టీలో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీ లు వరుసగా 4.5 శాతం, 3.5 శాతం చొప్పున విలువ కోల్పోయా యి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఆటో, లోహ, ఐటీ, బ్యాంకింగ్ సూచీలు అత్యధికం గా 4.85 శాతం వరకు క్షీణించాయి.
ప్రధాన ప్రతికూలాంశాలు..
అమెరికా మాంద్యంలోకి జారుకుంటుందనే విశ్లేషణలు, సంకేతాలు ప్రపంచ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. ఆ దేశంలో ఉపాధి పడిపోతుందనే గణాంకాలు ఆందోళన రేపాయి. ఈ ఏడాది జులై నెలలో వ్యవసాయేతర రంగాల్లో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదయ్యాయని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ గణంకాలు వెల్లడించాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే కనీసం 2 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. కానీ ఆ స్థాయి, అంచనాలకు తగ్గట్లుగా ఉద్యోగాల సృష్టి లేకపోవడం.. నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి పెరగడం ప్రపంచ మార్కెట్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మార్కెట్ల పతనానికి ఇదే ప్రధాన కారణం. దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవల వడ్డీరేట్లను 0.25 శాతం పెంచడం, బాండ్ల కొనుగోళ్లను తగ్గించడంతో అక్కడి నికారు సూచీ 14 శాతం పడిపోవడం.. ఇతర ఆసియన్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సంకేతాలు ఇవ్వడం ప్రపంచ మార్కెట్లను మరింత కలవరానికి గురి చేశాయి.