దంచికొట్టారు

Beaten– జెమీమా రొడ్రిగస్‌ సెంచరీ
– మంధాన, హర్లీన్‌, ప్రతిక మెరుపుల్‌
– ఐర్లాండ్‌పై భారత్‌ ఘన విజయం
నవతెలంగాణ-రాజ్‌కోట్‌ : భారత్‌, ఐర్లాండ్‌ మహిళల రెండో వన్డేలో టీమ్‌ ఇండియా అమ్మాయిలు దంచికొట్టారు. జెమీమా రొడ్రిగస్‌, స్మృతీ మంధాన, ప్రతిక రావల్‌, హర్లీన్‌ డియోల్‌లు ఐర్లాండ్‌ బౌలర్లను ఊచకోత కోశారు. టాప్‌-4 బ్యాటర్లు ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు నమోదు చేయటంతో వన్డేల్లో భారత్‌ అత్యధిక స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లకు 370 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. జెమీమా రొడ్రిగస్‌ (102, 91 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీతో మెరువగా.. కెప్టెన్‌ స్మృతీ మంధాన (73, 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్లీన్‌ డియోల్‌ (89, 84 బంతుల్లో 12 ఫోర్లు), ప్రతిక రావల్‌ (67, 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్లు స్మృతీ మంధాన, ప్రతిక రావల్‌ తొలి వికెట్‌కు 18.6 ఓవర్లలోనే 156 పరుగుల భాగస్వామ్యం నిర్మించి భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. హర్లీన్‌ డియోల్‌, జెమీమాలు మూడో వికెట్‌కు 183 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు చేసింది. భారీ ఛేదనలో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 254/7 పరుగులే చేసింది. క్రిస్టినా (80), లారా (37), సారా (38) రాణించారు. 116 పరుగుల తేడాతో భారత్‌ రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. జెమీమా రొడ్రిగస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత్‌, ఐర్లాండ్‌ మహిళల చివరి వన్డే రాజ్‌కోట్‌లోనే బుధవారం జరుగనుంది.