సుందర కామ్రేడువయా!

‘ఎంతటి త్యాగమయా, ఎంతటి తేజమయా, ఎదలో నిలిచేవూ ఎన్నటికీ, సుందరయా మా సుందరయా!’ అంటూ 1985లో ఆయన అమరుడయినపుడు గుండెనిండా పాడుకున్నాము. దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచింది. ఆనాడెంత స్ఫూర్తినీ చైతన్యాన్ని అందించాడో, నేడు కూడా సుందరయ్య పేరు తలవగానే అంతే చైతన్యం ప్రేరణ ఆవహిస్తోంది. ఎందుకంటే ఒక కమ్యూనిస్టు ఎలా ఉండాలో, ఎలాంటి పాత్ర నిర్వహించాలో ఆయన జీవితం ఒక పాఠంలా ఇప్పటికీ బోధిస్తూనే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన వారిలో ముఖ్యుడే కాక, తెలుగు నేలపైన అశేష ప్రజలను అభ్యుదయ ఆలోచనల వైపునకు ప్రభావితం చేసిన ప్రజానాయకుడు ఆయన. ఒక శిఖర సమాన ప్రేరణాజీవితాన్ని, నిత్యచేతనా సంకేతమైన మహోన్నత వ్యక్తిత్వాన్ని తలచుకుంటేనే స్ఫూర్తి ప్రవాహమై నిండే రూపం సుందరయ్యంటే. అత్యంత మానవీయతకు నిలువెత్తు రూపంగా నిలిచాడు కాబట్టీ, కమ్యూనిస్టు శ్రేణులకే కాక కమ్యూనిస్టు కాని జన సమూహాలకూ ఆదర్శంగా, గౌరవనీయంగా నిలిచాడు. కమ్యూనిస్టు ఉద్యమానికైతే, ఆయన ఆచరణ, ఆలోచన ఒక పాఠం లాంటిది. వర్ధంతి సందర్భంగా మళ్లీ మళ్లీ ఆయన్ని గుర్తు చేసుకోవడమంటే, నేటి మన కర్తవ్యాన్ని మరింత చైతన్యంతో నిర్వర్తించటమే. మనల్ని మనం ఒకసారి సరిచేసుకుని ముందుకు కదలటం. ఎందుకంటే నిబద్ధత, నిజాయితీ, అంకితభావం, పట్టుదల, కృషి ఆయనకు మారుపేర్లు.
ధనిక కుటుంబంలో పుట్టి పెరిగినా, జీవితాంతం వరకు కమ్యూనిస్టు ఆచరణతో ఉండటం ఆయన సొంతం. ఆశయంపై అచంచెల విశ్వాసంతో, కోరి కోరి కష్టాలను ఎంచుకుని, తనకు తాను పరీక్ష పెట్టుకుంటూ, తీర్చుకుంటూ ఎదిగిన సమున్నత వ్యక్తిత్వం అది. కమ్యూనిస్టుగా మారడమంటే ఏమిటి? మానవత్వము మూర్తీభవించిన మనిషిలా మారటమే. స్వార్థం, ఆధిపత్యం, వివక్షతలు దరిచేరకుండా అశేష సమూహానికి ఆదర్శంగా నిలవడం. అందరినీ నడిపించడం. కమ్యూనిస్టు కీలక సంకేతమవడం. సుందరయ్యలో మనకు కనపడేది అదే. విద్యార్థి దశనుండే పరుల కోసం పాటుపడాలన్న ఆలోచనతో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, సామ్యవాద భావాలకు ప్రభావితుడై ఎరుపు దారులలో మెరుపులా వెలుగొందాడు. కమ్యూనిస్టు పని, స్పందన ఎలా ఉండాలి? ఉద్యమాలు, పోరాటాలే కాదు, ప్రజల తలలో నాలుకలా పనిచేయాలి. సామాన్యుల ప్రతి సమస్యలో పాలు పంచుకోవాలి. అందుకే దివిసీమ వరదల వేళ, కరువు కాటకాల్లో జనం కోసం స్వచ్ఛందంగా పనిచేశాడు. అంతేకాదు పేదలు చదువుకోవాలని రాత్రి బడినీ నడిపాడు. సామాన్య ప్రజలకోసం సరుకులు తెచ్చి చౌకగా అందించాడు. ఇంతేకాదు వైద్యమందించి ప్రజల మనిషిగా నిలిచాడు. ఆనాటికి ప్రబలంగా ఉన్న దళిత సమస్య పారదోలటం కోసం స్వయంగా కృషిచేశాడు. కులపీడనపై పోరాడాలన్న పిలుపును ఆచరణ ద్వారా ఆనాడే ఇచ్చాడు. వ్యవసాయ కార్మికుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా సంఘాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు.లీల గారిని వివాహమాడి ఆదర్శంగా జీవించాడు. స్త్రీ సమానత్వాన్ని కోరుకున్నాడు.
దేశంలో విప్లవ సాధనకు మార్గాన్ని, వ్యూహాన్ని నిర్దేశించిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాయకత్వం వహించి పోరాడిన యోధుడు సుందరయ్య. ఆనాటి ప్రజల పోరాటాల చరిత్రను నమోదుచేసి భవిష్యత్‌ తరాలకూ అందించాడు. మితవాద, అతివాద పోకడలు సరికావని, సరైన మార్క్సిస్టు సైద్ధాంతిక కృషిలో తనవంతు పాత్రను పోషించిన మేధో సంపన్నుడు, భౌతిక వాస్తవిక విశ్లేషణా సమర్థుడు. అంతేకాదు, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకునిగా, శాసనసభ్యునిగా ప్రజాసమస్యల పట్ల లోతైన చర్చ చేసి, చట్టసభలను వర్గపోరాట క్షేత్రంగా ఎలా మలచుకోవాలో చూపిన నాయకుడు సుందరయ్య. నిరంతర అధ్యయనశీలిగా నదీ జలాలను ఎలా ఉపయోగంలోకి తేవాలో పరిశీలించి ‘ఆంధ్రదేశంలో సమగ్రనీటి పథకం’ అదించారు. గ్రామీణ పేదలకు భూ పంపకం చేసే మార్గాలనూ సమగ్రంగా సూచిం చాడు. తెలుగునేలను ప్రజారాజ్యంగా మార్చటానికి కావలసిన ప్రణాళికను ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’గా అందించాడు. సాంస్కృతిక కళారంగాలపై కూడా మంచి పట్టున్నవారు ఆయన. సాహిత్య విమర్శలో, భాషా దృక్పధంలో, కళారంగంలోనూ విశ్లేషణలు చేసిన రచయిత, విమర్శకుడు. కమ్యూనిస్టు సంబంధాలను కార్యకర్తలతోని కొనసాగాల్సిన అనుబంధాన్ని సుందరయ్య నుండి నేర్చుకోవాలి. క్రమశిక్షణకు, కార్యకర్తల శిక్షణకూ ఆయన చూపిన ప్రాధాన్యత మరువలేనిది.
కామ్రేడ్‌ సుందరయ్య గారి ఆశయపథం మనందరికీ శిరోధార్యం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయన నడిచిన దారిలో నిరంతరంగా కొనసాగటమే నిజమైన వారసత్వం. ఆయన పేరుతో వెలసిన విజ్ఞాన కేంద్రాలు నిత్య చైతన్య స్పూర్తిని అందిస్తూనే ఉన్నాయి. ప్రజాసాంస్కృతిక సేవా కార్యక్రమాలనూ సాగిస్తున్నాయి. ఇప్పటికీ నిండైన ప్రేరణ నింపుతున్న సార్థకమైన జీవితం ఆయనది. అందుకే కవి ”ఒకరో ఇద్దరో వారసులుంటే అది రక్త సంబంధం, లక్షలాది మంది నీ వారసులుంటే, అది కమ్యూనిస్టు సంబంధం” అని ఆయన గురించి అనగలిగాడు. అలాంటి సంబంధాన్ని అందించిన సుందర కామ్రేడు, మన సుందరయ్యకు లాల్‌సలామ్‌!