వ్య‌ర్థాల‌తో అంద‌మైన శిల్పాలు

Beautiful sculptures with wasteమహిళలు పెండ్లి తర్వాత కుటుంబం, పిల్లల బాధ్యతలతో తీరికలేకుండా గడిపేస్తుటారు. ‘ఇక మా కలలు నిజం చేసుకునే అవకాశం ఎక్కడుంది’ అనుకుంటూ ఢలాీపడిపోతారు. కానీ కాస్త సమయం చిక్కినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తామేంటో నిరూపించుకునేవారు కొందరుంటారు. ఆ కోవకు చెందిన వారే డాక్టర్‌ స్నేహలత ప్రసాద్‌. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వ్యర్థాలకు జీవం పోస్తూ గొప్ప శిల్పిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భర్త, కుటుంబ చేయూతనందిస్తే మిళలు అద్భుతాలు సృష్టిస్తారనేందుకు నిదర్శనంగా నిలిచిన ఆమె పరిచయం నేటి మానవిలో…
స్నేహలత సొంతూరు రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌. తల్లి లీలాదేవి ప్రోత్సాహంతో కళారంగంలోకి అడుగుపట్టారు. పైన్‌ ఆర్ట్స్‌సబ్జెక్ట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఆ తర్వాత పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు. పెండ్లి తర్వాత హైదరాబాద్‌కు వచ్చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుటుంబం, పిల్లల బాధ్యతలతో తీరిక లేుండాపోయింది. దాంతో తన కళకు కొంత కాలం విరామం ఇచ్చారు. కానీ తనలోని సృజనా త్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది.
ఆత్మవిశ్వాసాన్ని జోడించి
పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత భర్త ప్రసాద్‌ సహకారంతో తన కెరీర్‌లో సెంకడ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు స్నేహ. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతి పెద్ద పెయిటింగ్‌ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. స్నేహ కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు ప్రకృతి పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమంతా ఆమె ప్రతీ పెయింటింగ్‌లోనూ మనకు కనిపిస్తుంది. ఢిల్లీ, జైపూర్‌, హైదరాబాద్‌లో అనేక ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ నిర్వహించారు. దాదాపు అన్నింటికీ ప్రజల మండి మంచి ఆధరణ లభించింది. ఈ విజయం నుండి మరింత ప్రోత్సాహం అందుకున్నారు. మనిషి జీవితంతో ముడిపడిన ప్రేమను ఆమె తన చిత్రాలలో ఎంతో అందంగా చూపిస్తారు.
శిల్ప కళలో…
చిత్రకళ ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో స్నేహకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ పెంచుకున్నారు. పట్టుదలతో అందులోనూ రాణించారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. తన ప్రతిభతో భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్‌ ఇలా వస్తువు ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలో ఆమెది అందె వేసిన చేయి.
విద్యార్థులకు శిక్షణ
తనలోని కళను పది మందితో పంచుకోవాలనే ఉద్దేశంతో స్నేహ ఆర్ట్స్‌ ప్రారంభించారు. దీని ఆధ్వర్యంలో ఆర్ట్‌ క్యాంపులు, ఆర్ట్‌ ఫెయిర్‌, కోర్సులు, ఆర్ట్‌ గ్యాలరీ ఎగ్జిబిషన్‌లు, ఆర్ట్‌ టాక్‌లు, లైవ్‌ డెమోలు, డాక్యుమెంటరీలతో బిజీగా గడుపుతున్నారు. అలాగే ‘రంగభూమి’ అనే వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగానే కాకుండా తర్వాతి తరాన్ని తీర్చిదిద్దే శిక్షకురాలిగా మారారు. ‘గురుకులం లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదలగా, పూర్తి నిబద్దతతో చితరకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ, సంప్రదాయాల మీద అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే వారు ఎవరూ ఊహించలేని అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ తన భవిష్యత్‌ కర్తవ్యాన్ని పంచుకున్నారు స్నేహ.
పర్యావరణ శిల్పం
పుణేలోని వాకాడ్‌లో, కస్తూరి చౌక్‌ వద్ద ఇటీవ ఒక పర్యావరణ శిల్పాన్ని ఆమె ఏర్పాటు చేశారు. ఇందులో కార్మికుల భద్రతకు చిహ్నమైన టోపీతో పాటు సమాజానికి, స్థిరత్వానికి మధ్య కీలకమైన బంధాన్ని తెలిపేలా డీఎన్‌ఏ గొలుసు, ఇంకా పరిశ్రమలు, శక్తి, ఆవిష్కరణల మేళవింపుతో దీన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్నేహ దీన్ని రూపొందించారు. 21 అడుగుల పొడవు, 15 అడుగుల వెల్పుతో రెండు నెలల పాటు శ్రమించి దీన్ని సృష్టించారు.
డ్రీమ్‌ ప్రాజెక్ట్‌…
స్నేహ పుట్టింది రాజస్థాన్‌లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్‌లో. అందుకే ఆమెకు ఈ ప్రాంతమంటే ఎంతో అభిమానం. అందుకే ఈ మహానగరం కోసం ఏదైనా చేయాలని నిరంతరం తపిస్తున్నారు. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమల నుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్‌లు, నట్లు తదితర వస్తువులతో తెలంగాణకు తలమానికమైన చారిత్రక కట్టడం ‘చార్మినార్‌’ను యథాతథంగా నిర్మించాలనుకుంటున్నారామే. అది కూడా సందర్శకులు తను నిర్మించే చార్మినార్‌ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అమె అంటున్నారు. ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తల నుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని నమ్మకంగా చెబుతున్నారు.
గొప్ప అనుభూతి
పనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాల నుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం తన బాధ్యతగా ఆమె భావించారు. కాలుష్య నివారణలో అందరూ భాగం పంచుకోవాలని ఆమె కోరుకుంటున్నారు. ‘చిన్నప్పటి నుండి గొప్ప విజయాలు సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకన్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్మ, ధూళి నాకు కనిపించదు. 200 ఏండ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది’ అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
వెసులుబాటును ఉపయోగించుకొని
‘చిత్రకళైనా, శిల్ప కళైనా ప్రతీ దానికీ ఓ లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒక అందమైన చిత్రంగా మల్చుకున్నాను. ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. సాధించాలనే పట్టుదలా ఉంటుంది. కానీ తొలుత నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకులొస్తాయి. తీరా చదువుకున్నాక కుటుంబం ముందు, కరియర్‌ తర్వాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రత్యా చాలా మంది తమలోని ఆశలను చంపేసుకుంటున్నారు. కానీ ఇది సరైనది కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి’ అంటారు స్నేహలత.