బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలలి

Adialabad,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ-నస్పూర్‌
బీడీ కార్మికులకు జీవన భృతి రూ.4000 ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, కార్మికులకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికులకు అనేక ఆంక్షలు విధించి, తీవ్ర ఇబ్బందులు కలిగించారని ఆయన తెలిపారు. భీడీ పరిశ్రమను దెబ్బతీయాడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాల చర్యలను చేపట్టి, సిగిరేటు కంపెనీలకు ఊడిగం చేస్తుందని, బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించి బీడీ కార్మికుల జీవనోపాదిని దెబ్బ తీస్తూ, సిగరెట్‌ పరిశ్రమ అదిపతులకు ఊడిగం చేస్తున్నాడని ఆరోపించారు. మోడీ ఎన్నికల్లో ఉపాధి భద్రత, స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువులు ఇస్తామని వాగ్దానాలు చేసి, కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్‌ కంపెనీలకు సేవ చేసిందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో నాలుగు లేబర్‌ కోడ్‌ లను అమలు చేయడం సాధ్యం కాదని తీర్మానం చేయాలని ఆయన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బి.భూమన్న, రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌, అరుణోదయ రాష్ట్ర నాయకులు మల్లన్న, నాయకులు మంగ, శ్రీకాంత్‌, అనిత, బీడీ కార్మికులు శ్రీలత, గంగ భవాని, సుజాత, తిరుమల పాల్గొన్నారు.