బీర్ల ఐలయ్య సంస్కార రహితంగా మాట్లాడుతున్నారు: గొంగిడి సునీత

– కేటీఆర్ ను విమర్శించే స్థాయి ఐలయ్యకు లేదు

– వారి నాయకుడు దొంగల ముఠా నాయకులు
– కేసీఆర్ ఉద్యమ నాయకుడు
నవతెలంగాణ – భువనగిరి
ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కేటీఆర్ ను ఉద్దేశించి సంస్కార రహితంగా మాట్లాడుతున్నారని ఆ భాష మార్చుకోవాలని బిఆర్ఎస్ మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హితవు పలికారు. ఆదివారం భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ను విలేకరుల సమావేశం పెట్టి  ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనుచిత వాక్యాలు,  అబద్ధపు మాటలు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీర్ల ఐలయ్య చదువుకున్నారు కానీ సంస్కార రహితంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ విప్ అనే పదవి క్యాబినెట్ హోదా గలదని అలాంటి గౌరవప్రదమైన పదవిలో ఉండి సభ్యత లేని పదాలు వాడడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గవర్నర్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా వారి బాధ్యతను నిర్వర్తించడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలను సంభండ వర్గాలను ఒకతాటిగా తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ జాతిపిత కెసిఆర్ ను విమర్శించే స్థాయి బీర్ల ఐలయ్య తో పాటు కాంగ్రెస్ నాయకులకు ఆ పార్టీ ముఖ్యమంత్రి కి లేదన్నారు. తమ నాయకుడు ఉద్యమ నాయకుడు అయితే రేవంత్ రెడ్డి దొంగల ముఠా నాయకుడని త్రీవ విమర్శలు చేశారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించకపోతే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు కాలేరన్న విషయాన్ని గుర్తు చేశారు.
బీర్ల ఐలయ్య నైతికత గురించి మాట్లాడడని ఎద్దేవా చేశారు. అతనికి నైతికత అంటే తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 33 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ప్రకటించడం అబద్దం అన్నారు. గత ప్రభుత్వమే నోటిఫికేషన్ విడుదల చేసి రాత పరీక్షలతో పాటు  ఫలితాలు విడుదల చేసింది అన్నారు. వారు కేవలం నియామక పత్రాలు మాత్రమే అందజేశారు అన్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై దాడి చేయడం వారికి విద్యార్థులు పై ఉన్న ప్రేమ తెలుస్తుందన్నారు. మెగా డీఎస్సీ ఎప్పుడు అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ లో ప్రకటిస్తామని చెప్పి నేటి వరకు ప్రకటించలేదన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి, పట్టణ కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు అనేక ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్  దేనిని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ కేవలం 43% రైతులకు మాత్రమే చేసిందన్నారు. చేసేది గోరంతయితే చెప్పేది కొండంత ఉంటుందన్నారు. మీ బాస్ రేవంత్ రెడ్డిది మెప్పించడానికి కేసీఆర్, కేటీఆర్ ను ప్రస్తావించి ఆరోపణలు చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల వారిని కలిసి తమ పార్టీలోకి రమ్మని ప్రలోభాలు పెట్టి తీసుకురాలేదన్నారు.  వారువచ్చి అభివృద్ధి కోసం పార్టీలో చేరుతామంటే నేరుగా తీసుకోలేదన్నారు. రాజ్యాంగ పరిధిలో వారు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి వచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ విప్ గౌరవ హోదాలో ఉన్న బీర్ల ఐలయ్య భాషను మార్చుకొని ముందుకు పోవాలని కోరారు. లేకుంటే తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పి శంకరయ్య నాయకులు బిక్కు నాయక్, కర్రే వెంకటయ్య, తిరుమలేష్, బాలమణి, పల్లా వెంకటరెడ్డి, తోటకూర అనురాధ బీరయ్య, పాపట్ల నరహరి, పత్తి వెంకటేష్, పాల్గొన్నారు.