టైటిల్‌ ముంగిట!

టైటిల్‌ ముంగిట!– హైదరాబాద్‌ లక్ష్యం 198,ప్రస్తుతం 71/1
– మేఘాలయతో రంజీ ప్లేట్‌ ఫైనల్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ ప్లేట్‌ లీగ్‌ ఫైనల్‌కు హైదరాబాద్‌ చేరువైంది. మేఘాలయతో టైటిల్‌ పోరులో 198 పరుగుల ఛేదనలో హైదరాబాద్‌ ప్రస్తుతం 71/1తో దూసుకెళ్తోంది. సీనియర్‌ ఓపెనర్‌ తన్మరు అగర్వాల్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించి నిరాశపరిచినా.. నైట్‌వాచ్‌మన్‌ తనరు త్యాగరాజన్‌ (17 నాటౌట్‌, 35 బంతుల్లో 1 ఫోర్‌) తోడుగా రాహుల్‌ సింగ్‌ (50 నాటౌట్‌, 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో మెరిశాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన రాహుల్‌ సింగ్‌ హైదరాబాద్‌ను గెలుపు దిశగా నడిపించాడు. మూడో రోజు ఆట చివర్లో 11 ఓవర్లు ఆడిన హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీ ప్లేట్‌ టైటిల్‌కు హైదరాబాద్‌ మరో 127 పరుగుల దూరంలో నిలిచింది. ఇక అంతకుమందు మేఘాలయ రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించింది. ఓపెనర్‌ రాజ్‌ బిశ్వ (100, 114 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. సచ్‌దేవ్‌ సింగ్‌ (81, 157 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం అర్థ సెంచరీతో మెరువగా మేఘాలయ రెండో ఇన్నింగ్స్‌లో 71.3 ఓవర్లలో 243 పరుగులు చేసింది. రాజ్‌ బిశ్వ, సచ్‌దేవ్‌ మినహా ఆ జట్టులో ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. హైదరాబాద్‌ స్పిన్నర్‌ తనరు త్యాగరాజన్‌ (5/86) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. రోహిత్‌ రాయుడు (2/60), తిలక్‌ వర్మ (1/4), రిషబ్‌ (1/16) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 304 పరుగులు చేయగా, హైదరాబాద్‌ 350 పరుగులు చేసింది. ఛేదనలో 6.45 రన్‌రేట్‌తో దంచికొడుతున్న హైదరాబాద్‌ నేడు ఉదయం సెషన్లోనే లాంఛనం ముగించేందుకు సిద్ధమవుతుంది.