ఆ మధ్య, ఒక నెల కిందట, ‘బెగ్గింగ్ మాఫియా’ అనే పేరుతో, దాదాపు అన్ని టీవీ చానళ్ళలోనూ, హైదరాబాదు నగరంలో, ‘బిచ్చగాళ్ళ బెడద’ ఎంతగా వుందో, ఒక వార్తని చాలా సేపు ప్రసారం చేశారు. వేరే రాష్ట్రం నించీ ఇక్కడికి వచ్చి, భిక్షాటననే ఒక పెద్ద వ్యాపారంగా నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారట ‘పోలీసులు’. ఆ వ్యక్తి పిల్లల్నీ, వృద్ధుల్నీ, ఆడవాళ్ళనీ, హిజ్రాల వేషాలు వేయించి మగవాళ్ళనీ, భిక్షాటనలోకి దింపి వ్యాపారం చేస్తున్నాడట! ఆ అడుక్కునే వాళ్ళందరూ, ఉదయం నించీ, రాత్రి చీకటి పడేవరకూ, రద్దీ ప్రాంతాల్లో నిలబడి, అడుక్కు తెచ్చుకున్న డబ్బుల్లో నించి, రోజుకి రెండో, మూడో వందలు, వాళ్ళకి కూలిగా ఇచ్చి, మిగతా వేల, వేల రూపాయలు తను వుంచుకుని,పెద్దఎత్తున వాళ్ళని దోపిడీ చేస్తున్నాడని అతని మీద కేసు!
భిక్షాటనని ఒక వ్యాపారంగా నడపడానికి వీలునిచ్చిన పరిస్థితులు ఏమిటి? అసలు భిక్షాటన చెయ్యవలిసిన అగత్యం ఎవరికైనా ఎందుకు వస్తుందీ?- అనే ప్రశ్నలు, ఏ చానలు వారూ వేసుకోలేదు. కేవలం పోలీసులు ఇచ్చిన సమాచారాన్నే తిరిగి వల్లించారు. అనాధలైన పిల్లలూ, ఆడవాళ్ళూ, వృద్ధులూ, పనీ పాటా లేని సోమరి మగవాళ్ళూ భిక్షాటన మీద ఆధారపడి బ్రతుకుతున్నారని చెప్పుకొచ్చారు. భిక్షాటనే బతుకుతెరువుగా ఎందుకు మారిందో, తెలుసుకోవడానికి జరిగిన కొన్ని సర్వేలు కూడా, దానికి గల మూల కారణాలను పట్టుకుని, సరిఅయిన పరిష్కారాలను సూచించే పని చెయ్యలేదు. చానళ్ళ వారే కాక, ప్రభుత్వ శాఖల వారూ, సంఘసంస్కరణవాదులుగా వున్న స్వచ్ఛంద సంస్తల వారూ కూడా, పై పై కారణాలను మాత్రమే చూసి, చిట్టిపొట్టి సంస్కరణలనే సూచించారు!
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలూ, పోషించే భర్తలు లేని స్త్రీలూ, కుటుంబసభ్యుల ఆదరణ లేని వృద్ధులూ, బొత్తిగా పనులు దొరకని పేదలూ, ఉన్న పనులు పోయిన నిరుద్యో గులూ, చాలీచాలని పైసలతో చితికిపోయి, అప్పులపాలై ఊళ్ళు వదిలేసి తిరిగే వాళ్ళూ, అన్యాయంగా సంఘ చీత్కారానికి గురై వేరే దారిలేని ‘హిజ్రా’లూ… ఇలా అనేక రకాలుగా దిక్కులేని వాళ్ళు, గత్యంతరం లేక ఈ భిక్షాటన అనే ‘ఆత్మ గౌరవం’ లేని జీవితాల్ని గడపవలిసి వస్తున్నదని సర్వేలు చెబుతున్నాయి.
సర్వేలు గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ, ప్రభుత్వాలు గానీ చూపే పరిష్కారాలు సమస్యని తిరిగి తలెత్తకుండా చేసేవికాదు. పిల్లలకు అనాధా శ్రమాలూ, వృద్ధులకు పెన్షన్లూ, వృద్ధాశ్రమాలూ, స్త్రీలకు చిట్టి చిట్టి స్వయం ఉపాధి పధకాలూ, పనులు లేనివారికి నిరుద్యోగ భృతీ… వంటివి కొంత ఉపశమనం కలిగించే పరిష్కారాలు మాత్రమే! ఇవి కూడా, అవసరమైన వారిలో అతి కొద్దిమందికి మాత్రమే అందుతాయి! ఎంత సక్రమంగా అమలు పరిచినా! పైగా, భిక్షాటన మీద ఆధారపడి బతకవలిసిన జనాల సంఖ్య సాధారణంగా పెరుగుతూనే వుంటుంది.
ఈ భిక్షాటన అనేది బ్రతుకుతెరువుగా వుండడం ప్రపంచం లో అన్ని దేశాలలోనూ, తరతమ భేదాలతో కనిపి స్తుంది. మానవ సమాజ చరిత్రలో, ఈ భిక్షాటన అనేది ఎప్పుడు తలె త్తిందీ, ఏ రూపాల్లో, ఏ స్థాయిల్లో వుండేదీ… అదంతా ఇక్కడ చూడలేము. పెట్టుబడిదారీ ఆర్ధిక విధానం మొదలైనప్పటినించీ మాత్రం భిక్షాటన ఒక బ్రతుకుతెరువు మార్గంగా స్థిరపడి పోయింది! ఈ సంగతిని, పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ గురించి, లోతుగా పరిశోధించిన మార్క్సూ, ఎంగెల్సుల రచనల్లో చూడవచ్చు.
పెట్టుబడిదారీ విధాన లక్ష్యం అంతా’లాభం’! ఆ లాభం కోసం ఒకర్ని ఒకరు నాశనం చేసేటంత పోటీ! లాభాల కోసం జరిగే ఈ పోటీలో, మధ్య స్థాయి పెట్టుబడిదారులు, కార్మికులు గానూ, కార్మికులలో ఒక సెక్షను పనులు పోయి బిచ్చగాళ్ళుగానూ మారతారని నిరూపించాడు మార్క్సు. (‘1844 నాటి ఆర్ధిక, తాత్విక రాత ప్రతులు’)
మార్క్సు : ”పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఏమి చేస్తుం దంటే, శ్రమజీవుల జనాభాలో ఒక భాగంతో శక్తికి మించిన పని చేయించుతుంది. ఇంకోభాగాన్ని, పూర్తిగానో పాక్షికంగానో నిరు పేదలుగా ఉంచుతుంది.” (‘అదనపు విలువ సిద్ధాంతాలు-2’లో). ఆ నిరుపేద జనాలు, పెట్టుబడి దృష్టిలో అవసరంలేని ”అదనపు జనాభా”! అంటే, వారితో ఇక పెట్టుబడికి అవసరం లేదని! ఉన్నవారితోనే ఎక్కువ పని చేయించుతారు గనక! దీని వల్ల పని దొరకని వారికి నిరంతరం బ్రతుకు తెరువుకి దారి మూసుకుపోతుంది. ఇంక అప్పుడు, భిక్షాటనా, దొంగతనాలూ, వ్యభిచారమూ వంటి దుర్భరమైన పనులే బ్రతుకు తెరువులు అవు తాయి. ఈ పనుల్లో వుండే వారిని ‘అలగా జనం’ అని అంటారు. ‘అలగా’ అనే అర్ధం, హిందీలో ‘అలగ్’ (వేరు) అనే మాటనించీ తెలుగులోకి వచ్చింది. అంటే, ఆ పనులు చేసే వారు, మామూలు మనుషుల నించీ ‘వేరు’గా, పనికిరానివారిగా వుండే వారు- అని వ్యతిరేక అర్ధం. కానీ, వీళ్ళని ”క్షీణించిన” (”రూయిన్డ్”) కార్మికులుగా మార్క్సు ప్రస్తావిస్తాడు, ఒక చోట! అంటే, వీళ్ళంతా, తమ గతంలో, కార్మికులుగా పని చేసిన వారే. కానీ, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వల్ల, పనులు పోయి, చేద్దామన్నా ఏ చిన్న పనులూ దొరక్క, జీవితాలు నాశనం అయ్యి, కటిక దారిద్య్రం వల్ల వేరే దారేలేక, ఈ బాట పట్టారు.
మార్క్సుని వినండి : ”కటిక దారిద్య్ర పరిస్థితులకు సంబంధించిన గణాంక వివరాలను పరిశీలిస్తే, ప్రతీ పారి శ్రామిక సంక్షోభంతో పాటు, కటిక దరిద్రుల సంఖ్య పెరుగు తుందనీ, ప్రతీ పారిశ్రామిక పునరుద్ధరణతో బాటుగా వీరి సంఖ్య తగ్గుముఖం పడుతుందనీ, ఎవరైనా గమనించగలరు… అదనపు జనాభాతో పాటు, ‘కటిక దారిద్య్రం’ అనేది, పెట్టుబడి దారీ ఉత్పత్తికీ, పెట్టుబడి దారీ తరహా సంపదకూ, ఒక షరతు. … అయితే, ఈ కటిక దరిద్రులలో అత్యధిక సంఖ్యాకులను, తన భుజస్కంధాల మీద నుంచీ తీసేసి, కార్మిక వర్గపు భుజస్కంధాల మీదకూ, దిగువ మధ్య తరగతి భుజస్కంధాల మీదకూ, ఎలా విసిరి వెయ్యాలో పెట్టుబడికి తెలుసు.” (‘కాపిటల్-1’, చాప్టర్-25).అంటే, బిచ్చగాళ్ళుగా మారిన నిరుపేదలకు బిచ్చాలు దొరికేది ఎవరి వల్ల? ఏదో ఒక వేతన శ్రమలోనూ, స్వతంత్ర శ్రమల్లోనూ బ్రతికే శ్రామిక జనాల కొంపల ముందే గానీ, మహా భవనాల ముందు మాత్రం కాదు. అంటే, బిచ్చాలు వేసి, బిచ్చ గాళ్ళని పోషించేది కార్మిక జనాభాయే!
మనుషులు తమ పోషణను భిక్షాటన వంటి అవమాన కరమైన పద్ధతిలో కాక, ”గౌరవంగా” సంపాదించుకునే వీలుని, పెట్టుబడిదారీ సమాజం కల్పించదు. ఈ వాస్తవాన్ని, 1845 నాటి ఒక ఉపన్యాసంలో, ఎంగెల్సు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి: ”ప్రతి నాగరిక సమాజంలోనూ, సంతోషంగా పని చేయడానికి యిష్టపడినా, పని సంపాయించుకోజాలనట్టి నిరు ద్యోగ కార్మికులు పెద్ద సంఖ్యలో వున్నారు. సాధారణంగా అను కునే దానికంటే వాళ్ళ సంఖ్య యెక్కువగా వుంది. ఇలా వీళ్ళు యేదో ఒక మార్గాన, తమని తాము నీచపరుచుకునే కార్యాలు సాగించడం మనకు కనపడుతుంది- బిచ్చమెత్తుకోవడమో, అడుక్కుంటూ వీధులూడ్వడమో, వీధి మలుపుల్లో నిలుచుకో వడమో, అప్పుడప్పుడు దొరికే చిన్న పనుల ద్వారా ప్రాణం నిలుపుకోవడమో, వీధులు తిరిగి రక రకాల చిల్లర సరుకులు అమ్ముకోవడమో, లేదా, ఈ సాయంత్రం ఇద్దరు బీద అమ్మాయిలు చేసిన దానిని మనం చూసినట్లు, గిటార్ పట్టుకొని ఒక చోట నుండి మరొక చోటికి పోతూ, డబ్బు కోసం ఆడుతూ, పాడుతూ, నాలుగు పైసలు సంపాయించుకోడానికి రకరకాల సిగ్గుమాలిన మాటలనూ, ప్రతి అవమానకరమైన సూచననూ భరించడమో! చివరకు యెంత మంది నిజమైన సాని వృత్తికి లోబడుతారో! మిత్రులారా, యేదో ఒక మార్గాన సానితనం సాగించడం తప్ప గత్యంతరం లేని యీ బీద జనుల సంఖ్య చాలా పెద్దదిగా వుంది… మరి, సమాజం వీళ్ళ పోషణ ఖర్చును భరించవలసి వుంటే, యీ నిరుద్యోగులు తమ తిండి ఖర్చును తామే గౌరవంగా సంపాయించుకోవడం వీలయ్యేటట్లు సమాజం చేయాలి. కానీ, ప్రస్తుత పోటీ సమాజం యిది చేయజాలదు.” (ఎంగెల్స్)
మరి ఈ భిక్షాటన వంటి దుస్థితికి పరిష్కారం ఏమిటి? ప్రతీ మనిషీ, తన తిండిని గౌరవంగా సంపాయించుకోవడానికి వీలునిచ్చే సమాజం కోసం ప్రయత్నాలు ప్రారంభించడమే కదా? అవి ఎంత చిన్న చిన్న ప్రయత్నాలైనా!
మన ప్రయత్నాలు ఫలించాలంటే, దీర్ఘకాలం పట్టే మాట నిజమే! అందుకే, ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనాన్ని అయినా కల్పించే పథకాల్నీ, ఏర్పాట్లనీ, పెద్ద స్థాయిలోనూ, సక్రమం గానూ అమలయ్యేలా ప్రభుత్వాల మీద వత్తిడి తేవాలి. కానీ, ఈ ఉపశమనాలతో సంతృప్తి పడకూడదు. పడితే, సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు అని గ్రహించలేమా? మానవ సమాజంలో భిక్షాటన ఒక శాశ్విత ధర్మంగా వుండవలిసిందేనా?
రంగనాయకమ్మ