హర్యానా గెలుపు వెనుక…

Behind Haryana's win...చాలామంది కుల పెద్దలు(ఖాప్‌ నాయకులు) అవినీతిపరులని, వారు కొత్త నాయకులను ఎదగనివ్వరని, హర్యానాలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి అలాంటి నాయకులే కారణమని మేము ప్రజలతో జరిపిన సంభాషణ లలో తేలింది.హర్యానా ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, అగ్నిపథ్‌ పథకానికి సంబంధించి యువత, భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడి లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళా రెజ్లర్లు వరుసగా తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. ఈ నిరసనల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని భావించారు. కానీ అన్ని అంచనాలకు భిన్నంగా బీజేపీ ఎన్నికల్లో గెలిచింది. ఈ నిరసనలు జాట్లలో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయని అప్పుడు వాదించటం జరిగింది. ఈ వాదన ప్రకారం, ఇది ఎన్నికల్లో జాట్‌ వర్సెస్‌ నాన్‌-జాట్‌ ధ్రువణానికి(పోలరైజేషన్‌కి) దారితీసింది. ఈ విషయంలోని గతిశీలతను అర్థం చేసుకోవ డానికి మేము హర్యానాను సందర్శించి, సింగు సరిహద్దులో జరిగిన రైతుల నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న జాట్‌ రైతులను, ఇతర రైతు నాయకులను కలవాలని నిర్ణయించుకున్నాము.
చాలామంది జాట్‌ రైతులు జాట్‌ వర్సెస్‌ నాన్‌-జాట్‌ పోలరైజేషన్‌ని ఖండించలేదు. అయితే, బీజేపీ జాట్లను దుర్మార్గులుగా చిత్రించటంవల్లనే ఇది సాధ్యమైందని వారు భావిస్తున్నారు. గ్రామాల్లోని బీజేపీి, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలు జాట్లకు, జాట్యేతరులకు మధ్య ఉండే చిన్న చిన్న రోజువారీ సమస్యలను ఘర్షణలుగా మార్చటాన్ని వారు గమనించారు. హిందూ-ముస్లింల మధ్య కూడా ఘర్షణలు ఇలాగే జరుగుతాయని, తప్పుడు సమాచారంతో మెజారిటీ సమాజం ప్రభావితమౌతుందని వారు ఇప్పుడు గ్రహించారు.
అన్ని కులాలు, వర్గాలు కలిసి జీవిస్తాయని మాతో మాట్లాడినవారిలో చాలా మంది చెప్పారు. జాట్లకు, దళితులకు కూడా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వారి మధ్య కులాంతర వివాహాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ”మేము కలిసి ఉన్నాము కానీ ఎన్నికల సమయంలో మేము విడిపోతాము” అని ప్రతిస్పదించినవారిలో ఒకరు అన్నారు. దానికి అక్కడ వున్న దళితులు అంగీకరించారు: ”అవును. జాట్లు ఓటు వేసే పార్టీకి మేము ఓటు వేయము”. నిత్య జీవితంలో పరస్పరం ఆధారపడటమనే పునాదిపై సాగే సామాజిక సహజీవనం అధికారం కోసం జరిగే పోరాటాలను, ఆధిపత్యం, వివక్షతలకు సంబంధించిన ఆందోళనలను నిర్మూలించజాలదనే వాస్తవం ఈ నిగూఢ అంశాన్ని వివరిస్తుంది.
రిజర్వేషన్ల ఉప-వర్గీకరణ తర్వాత చమార్లు కాని దళితులు, ఎక్కువగా వాల్మీకులు బీజేపీికి ఓటు వేశారని కూడా జాట్‌ రైతులు గమనించారు. దళితులు, ఓబిసిలలోనే కాకుండా జాట్లలో కూడా ఇటువంటి విభజనల వల్ల బీజేపీ ప్రయోజనం పొందుతుందనేది ఆసక్తికరమైన విషయం. అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్దిష్ట నియోజకవర్గంలో జాట్‌ అభ్యర్థులను నిలబెడితే, జాట్లు గోత్రాల వారీగా విడిపోతారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీి ఈ విధంగా జాట్‌ ఓట్లలో ఒక భాగాన్ని పొందింది. ఎన్నికలకు ముందు బిపిఎల్‌ కార్డులను కూడా బీజేపీ ఉచితంగా పంపిణీ చేసింది. ఈ కార్డులను ముఖియా లనబడే కుల పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పంపిణీ చేశారు. వీరిలో చాలామంది రాజకీయంగా బీజేపీితో సంబంధంలో ఉన్నారు. వీరు బీజేపీకి అనుకూలంగా ఉండటానికి ప్రోత్సహకాలు కొంతవరకు కారణం. దళితులు, ఓబిసిలు బీజేపీకి ఓటు వేయడం రాజకీయాల్లో మార్పుకు కారణం కాదని చాలామంది భావించారు.
రైతాంగ నిరసనల సమయంలో చురుకుగా పాల్గొన్న ఒక రైతు నాయకుడి నేతృత్వంలో జాట్లు నిర్వహించిన నిరసన ప్రదర్శనను మేము మరింత దూరం పయనించాక చూశాము. స్థానిక జాట్‌ కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులను హత్య చేసిన కేసులో పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడానికి వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. ఈ హత్యలను ఒక దళిత యువకుడు చేశాడనే ఆరోపణ ఉంది. అయితే సదరు రైతు నాయకుడు, ఇతరులు దీనిని సామాజిక లేదా కుల సంఘర్షణగా చూడలేదు. అంతేకాకుండా బీజేపీికి ఓటు వేసిన దళితులు తమ తప్పును గ్రహించారని, భవిష్యత్తులో కొత్తగా జాట్‌-దళిత ఐక్యత ఉద్భవిస్తుందని ఆ రైతు నాయకుడు వాదించారు. అయితే, జాట్‌లు, ఓబీసీలు కలవడం కష్టమని, దానికి కారణం ఓబీసీలు జాట్‌ నాయకత్వాన్ని అంగీకరించ డానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. సాపేక్షంగా సమాన స్థాయిగల కులాల కంటే అసమాన స్థాయిలోవున్న కులాలు ఒక కూటమిగా ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందనే సామాజిక కోణాన్ని ఈ అంశం లేవనెత్తుతుంది.
సర్‌ చోటూ రామ్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ జాట్‌ రైతు నాయకుడి విశ్లేషణ నిజమేనేమో అనిపించింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ జాట్‌ రాజకీయ నాయకులు, కులపెద్దలు మాత్రమే కాకుండా, బిఏఎమ్‌ సిఇఎఫ్‌కు చెందిన స్థానిక నాయకుడు కూడా కులఐక్యత గురించి అనర్గళంగా మాట్లాడారు. చాలామంది కులపెద్దలు (ఖాప్‌ నాయకులు) అవినీతిపరులని, వారు కొత్త నాయకులను ఎదగనివ్వరని, హర్యానాలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి అలాంటి నాయకులే కారణమని మేము ప్రజలతో జరిపిన సంభాషణల్లో తేలింది.
(టెలిగ్రాఫ్‌ సౌజన్యంతో)
– అజరు గుడవర్తి, మహేష్‌ చౌదరి