వైఫల్యానికి బాధ్యులంటూ…

– 8 మంది అధికారుల సస్పెన్షన్‌
– నిందితులపై ఉపా కేసు
– బీజేపీ ఎంపీ జోలికెళ్లని మోడీ సర్కార్‌
– పార్లమెంట్‌లో ఆంక్షలు…భద్రత కట్టుదిట్టం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో బుధవారం జరిగిన పొగదాడి ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. భద్రతా వైఫల్యానికి కారణమైన వారుగా పేర్కొంటూ ఎనిమిది మందిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్‌ అయిన అధికారుల్లో ప్రదీప్‌, , రాంపాల్‌, అరవింద్‌, గణేశ్‌, నరేంద్ర, అనిల్‌, విమిత్‌, వీరదాస్‌ ఉన్నారు.
ప్రధాని మోడీ సమీక్ష..
ఘటనపై ప్రధాని మోడీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, మంత్రులు ప్రహ్లాద్‌ జోషీ, అనురాగ్‌ ఠాకూర్‌, పీయూశ్‌ గోయల్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా సమావేశానికి హాజరయ్యారు.
‘ఉపా’ చట్టం కింద కేసు..
ఈ ఘటనలో నిందితులపై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. వీరిని గురువారం పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపర్చారు. వారిని ఏడు రోజుల కస్టడీని విధించింది.ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనక ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా.. ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు వివరించారు. అరెస్టయిన వారిలో డి.మనోరంజన్‌, సాగర్‌, అమోల్‌ షిండే, నీలందేవిలను బుధవారం అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు విశాల్‌ను గురుగ్రామ్‌లో అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న లలిత్‌ కోసం గాలిస్తున్నారు.
పాస్‌లు జారీ అయింది ఇలాగే..
లోక్‌సభలో దాడికి పాల్పడిన వ్యక్తులకు బీజేపీ మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా కార్యాలయం నుంచి సందర్శకుల పాస్‌లు జారీ అయ్యాయి. దాడికి పక్కా ప్రణాళికతోనే సిద్ధమైనట్టు అధికారులు భావిస్తున్నారు. లోక్‌సభలో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన డి.మనోరంజన్‌ మైసూరుకు చెందిన వాడని, తరచూ ఎంపీ ఆఫీసుకు వస్తుండేవాడని, విజిటర్స్‌ పాస్‌ కోసం మనోరంజన్‌ మూడు నెలలుగా ఎంపీ ఆఫీసును సంప్రదిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు సభలో బెంచ్‌లపై నుంచి దూకుతూ స్పీకర్‌ చాంబర్‌ వైపు దూసుకెళ్లిన సాగర్‌ శర్మను మనోరంజన్‌ తన స్నేహితుడని చెప్పి, పాస్‌ తీసుకున్నట్టు గుర్తించారు. కొత్త పార్లమెంటును చూడాలని ఉందంటూ ఎంపీ కార్యాలయ అధికారులకు చెప్పి, వీరు పాస్‌లు తీసుకున్నారు. బుధవారం సింహా తరఫున మొత్తం మూడు పాస్‌లు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. మరో మహిళకు పాస్‌ ఇచ్చినప్పటికీ.. ఆమె తన కుమార్తెతో కలిసి రావడం, చిన్నారి పేరు పాస్‌లో లేకపోవడంతో అనుమతించలేదని ఎంపీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
రెక్కీ నిర్వహించింది మనోరంజనే..
ఈ ఘటన మొత్తానికి మాస్టర్‌ మైండ్‌ మనోరంజనే అని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆయన పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
ఈ ఏడాది జరిగిన వర్షాకాల సమావేశాల సమయంలో మనోరంజన్‌ పార్లమెంట్‌ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంట్‌లో సిబ్బంది బూట్లను తనిఖీ చేయడంలేదనే విషయాన్ని అప్పుడే అతడు గుర్తించాడు. పోలీసులు అతడే ప్రధాన కుట్రదారు కావచ్చేమో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన సమయంలో లలిత్‌ కూడా పార్లమెంట్‌ ప్రాంగణంలోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్‌ సమీపంలో నీలమ్‌, అమోల్‌ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్‌ ఫోన్లో రికార్డ్‌ చేసినట్టు తెలిసింది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే.. నిందితులదరి ఫోన్లతో లలిత్‌ అక్కడి నుంచి పరారైనట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆ వీడియోను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఎన్జీవో సభ్యురాలికి పంపినట్టు సమాచారం. సదరు ఎన్జీవో సభ్యురాలు మీడియాతో మాట్లాడుతూ.. ”గతంలో లలిత్‌ మా ఎన్జీవోతో కలిసి పనిచేశాడు. పార్లమెంట్‌ వద్ద ఆందోళనకు సంబంధించి నాకు వాట్సాప్‌్‌ లో ఓ వీడియో షేర్‌ చేశాడు. దాన్ని వైరల్‌ చేయమని మెసేజ్‌ చేశాడు” అని ఆమె వెల్లడించారు.
దాడి జరిగాక భద్రత కట్టుదిట్టం
తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంట్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు ప్రాంగణం.. బయట అధికారులు భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీస్‌, పారా మిలిటరీ, పార్లమెంట్‌ ‘ స్పెషల్‌ సెక్యూరిటీ గార్డులతో పహారా నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌ సమీపంలో భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. పాసులు ఉన్న వారికి మాత్రమే పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం ఇస్తున్నారు. పార్లమెంట్‌ భవనానికి వెళ్లే మార్గాలన్నింట్లో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.
అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎంపీలు ప్రవేశించే ‘మకర ద్వారం’ నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు విధించారు. ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించి మీడియా సిబ్బందికి పాసులు జారీ చేస్తున్నారు. ఇక పార్లమెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి బూట్లను కూడా స్కాన్‌ చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
నేను లేకపోయినా.. సస్పెండ్‌ చేశారు: డీఎంకే ఎంపీ ఎస్‌ఆర్‌ పార్థిబన్‌
డీఎంకే ఎంపీ ఎస్‌ఆర్‌ పార్థిబన్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ జాబితాలో తన పేరు నమోదు కావడం ”జోక్‌” అని అన్నారు. ”నేను అనారోగ్యంతో ఉన్నందున సభలో లేను” అని అన్నారు.