బెల్లి లలిత కృషి మరువలేనిది..

– అరుణోదయ సాంస్కృతిక సమైక్య కన్వీనర్ విమలక్క

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : తెలంగాణ కోసం సుదీర్ఘకాలంగా జరిగిన పోరాటంలో బెల్లి లలిత కృషి మరువలేనిదని అరుణోదయ సాంస్కృతిక సమైక్య కన్వీనర్ విమలక్క అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరురాలు, తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత 24 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య కన్వీనర్ విమలక్కతో పాటు పలువురు నాయకులు బెల్లి లలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  బెల్లి లలిత ఏ ఆశయం కోసమైతే తపించిందో ఆ ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి  అన్నారు. నేడు కులాలుగా, మతాలుగా విభజన రేఖలు గీసి మనకు మనకే తాకులాటలు పెట్టే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కుల వర్గ రహిత సమాజం కోసమే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.