బీజింగ్ : ఈ నెల 17, 18 తేదీల్లో బీజింగ్‌లో జరగనున్న బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ మూడవ సమావేశానికి చైనా ఆతిథ్యమిస్తుందని విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్‌ఐ) 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలతో సహా వర్ధమాన దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారని భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఫుతిన్ కూడా బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో స మావేశమై ఆ తర్వాత ఈ సమావేశాలకు హాజరవుతారని భావిస్తున్నారు. భూ, సముద్ర మార్గాల ద్వారా ఆఫ్రికా, యూరప్‌లతో ఆసియాను అనుసంథానించేందుకు దశాబ్ద కాలం క్రితం చైనా బిఆర్‌ఐ పేరుతో అంతర్జాతీయ మౌలిక వసతుల అభివృద్ధి వ్యూహాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు 150కి పైగా దేశాలతో, 30కి పైగా అంతర్జాతీయ సంస్థలతో బిఆర్‌ఐ సహకార పత్రంపై సంతకాలు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది.