– పీవైఎల్ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బెల్టుషాపులను ఎత్తేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీవైఎల్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్, కార్యదర్శి వాంకుడోత్ అజరు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెల్టుషాపులను రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. బెల్టుషాపులతో యువత మద్యం మత్తులో మునిగిపోతున్నదని తెలిపారు. దీంతో నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో తెలంగాణను మద్యం మత్తులో మునిగేలా చేసిందని పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉంచడం సరైంది కాదని తెలిపారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.