నవతెలంగాణ – గోవిందరావుపేట
ఇందిరమ్మ లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం) ముఖ్య కార్యకర్తల సమావేశం కడారి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఆర్పాటం చేస్తుందని అన్నారు. వేలాదిమంది నిరుపేదలు ఇండ్లు ఇంటి స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలని అదేవిధంగా అద్దె ఇండ్లలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంద్రమ్మ కమిటీల పేరుతో అక్రమాలు జరిగే అవకాశం ఉన్నదని ఆరోపించారు. కొంతమంది దళారీలు ఇందిరమ్మ ఇండ్ల ఇప్పిస్తామని ప్రజలకు మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారని వారి మాటలను ఎవరు నమ్మవద్దని ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వవద్దని మల్లారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు అంబాల మురళి, ముమ్మడి ఉపేంద్రచారి, తీగల ఆదిరెడ్డి , గొంది రాజేష్ ,కొటెం కృష్ణారావు, సామ చంద్రారెడ్డి, ఎస్డి అంజాద్, గుండు రామస్వామి, గుండు లేనిన్, మంచాల కవిత, కందుల రాజేశ్వరి, కన్నోజు సదానందం కొలెపాక మహేందర్ తదితరులు పాల్గొన్నారు.