– యూపీ యోధాస్‌పై 32-29తో గెలుపు
– ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్
హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్‌లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్‌కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్‌రౌండర్ భరత్ (13) సూపర్ టెన్‌తో షో చేసినా.. ఫలితం దక్కలేదు. ప్రథమార్థంలో 12-11తో ఆధిక్యం సాధించిన బెంగాల్ వారియర్స్.. ద్వితీయార్థంలో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది.