నా కెరీర్‌లోనే బెస్ట్‌ క్యారెక్టర్‌..

Best character in my career..‘ఈ సంక్రాంతికి నా రెండు చిత్రాలు విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’, తమిళంలో విశాల్‌ చిత్రం రాబోతోంది’ అని నటి అంజలి చెప్పారు. గేమ్‌ ఛేంజర్‌’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ‘ఇందులో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్‌ కథతోపాటు క్యారెక్టర్‌ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఈ క్యారెక్టర్‌ నా నుంచి చాలా డిమాండ్‌ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్‌ నా పర్ఫామెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్‌ చిత్రం, బెస్ట్‌ క్యారెక్టర్‌ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నా పాత్రలో సస్పెన్స్‌, ట్విస్ట్‌ ఉంటుందని శంకర్‌ ఆల్రెడీ చెప్పారు. అది థియేటర్‌లో ఆడియెన్స్‌ చూసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌. నా పాత్రకు నేషనల్‌ అవార్డు వస్తుందని అంతా అంటున్నారు. నేను కూడా కథ విన్నప్పుడు అలానే అనుకున్నాను. నాక్కూడా అలానే అనిపించింది. అంతా అంటున్నట్టుగా అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్‌ ఇంకేం ఉంటుంది?, ఆ దేవుడి దయవల్ల అది నిజం కావాలి’ (నవ్వుతూ).
‘గేమ్‌ ఛేంజర్‌’ వల్ల నా ఆలోచనా ధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను. ఇక నెక్ట్స్‌ ఎంచు కునే పాత్రలు, సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ విషయంలో నాకు ‘గేమ్‌ ఛేంజర్‌’ అని చెప్పొచ్చు. సినిమా చూసి చిరంజీవి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.
– అంజలి