అశ్విన్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమా

Best movie in Ashwin's careerగంగా ఎంటర్టైన్మంట్స్‌ బ్యానర్‌ పై అప్సర్‌ దర్శకత్వంలో అశ్విన్‌ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. న్యూ ఏజ్‌ డివైన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం లాంచ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి హీరో విశ్వక్‌ సేన్‌, సంగీత దర్శకుడు తమన్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, ”ట్రైలర్‌ చూశా. చాలా బాగుంది. ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. అశ్విన్‌ కెరీర్‌లో ఇది నిలిచిపోతుందనిపిస్తుంది. ఆగస్ట్‌ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులు సక్సెస్‌ ఇస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘అశ్విన్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. శివేంద్ర నాతో పని చేశాడు. వికాస్‌ ఆర్‌ఆర్‌ బాగుంది. నిర్మాత మహేశ్వర్‌ రెడ్డికి మంచి సక్సెస్‌ రావాలి. డైరెక్టర్‌ అప్సర్‌ సినిమాను బాగా తీశారు. తమన్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది’ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ, ‘ ‘ట్రైలర్‌ రెండ్రోజుల ముందే చూశాను. ఆర్టిస్ట్‌కి టాలెంట్‌ ఉంటే సరిపోదు.. కసి కూడా ఉండాలి. అశ్విన్‌కు ఆ కసి ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి’ అని తెలిపారు. ‘మహేశ్వరుడి కథ.. నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి వరకు వెళ్లిందని అనిపించింది. డివోషనల్‌ పాయింట్‌ ఎందుకు పెట్టామనేది ప్రేక్షకుడు కన్వీన్స్‌ అయ్యేలానే చూపించాం’ అని డైరెక్టర్‌ అప్సర్‌ చెప్పారు. హీరో అశ్విన్‌ బాబు మాట్లాడుతూ, ‘ఈ కథను నిర్మాత నా దగ్గరకు తీసుకొచ్చారు. పాయింట్‌ చాలా బాగుంది. అప్సర్‌ ముస్లిం. ఆయన ఇలాంటి కథను ఎలా రాశారని అనుకున్నా. ఇదంతా శివ లీల అనిపించింది. చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోన్నాం. అందరికీ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.