అమ్మాయిలు లేకపోతే అమ్మలు ఉండరు. అమ్మలు లేకపోతే మనిషి జన్మ ఉండదు. అసలు ఈ సృష్టే ఉండదు. ఆ అమ్మ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఆడపిల్ల గడప దాటితేనే కాదు, కడుపులో ఉన్నా రక్షణ లేదు. దేశ లింగ నిష్పత్తిలో పెరిగిపోతున్న అసమానతలు చెబుతున్న సత్యమిది. మహిళా, శిశు సంక్షేమశాఖ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం కర్నాటక, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీఘర్‌తో పాటు మొత్తం 12రాష్ట్రాలలో గత రెండేండ్ల కాలంలో లింగ నిష్పత్తి తగ్గిపోయింది. అయితే నిటి అయోగ్ నివేదికలో మాత్రం బేటీ బచావ్… బేటీ పఢావో పథకం అద్భుతంగా పని చేస్తున్నదని చెబుతున్నారు. గతంతో పోలిస్తే లింగ నిష్పత్తి మెరుగ్గా ఉందని నివేదించారు. మరి ఈ పథకం అంత గొప్పగా పనిచేస్తుంటే దేశంలోని ఇన్ని రాష్ట్రాలలో అమ్మాయిల నిష్పత్తి ఎందుకు తగ్గిపోయిన్నట్టో ఏలినవారే సమాధానం చెప్పాలి.
తిమ్మిని బమ్మిని చేయడం, మాటల గారడితో ప్రజలను మాయ చేయడంలో మన దేశ పాలకులకు మించిన వారులేరు. ఈ విషయం మరోసారి స్పష్టమయింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి(డబ్ల్యూసీడీ) మంత్రిత్వశాఖ ఇటీవల అందించిన సమాచారమే దీనికి చక్కటి ఉదాహరణ. ఈ లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నది. ఆయా రాష్ట్రాలలో బాలుర సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువగా ఉంది. కండ్ల ముందు లెక్కలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే బేటీ బచావో… బేటీ పఢావో పథకం గొప్ప ఫలితాలను ఇస్తుందని మన ప్రధాని ఊదరగొడుతున్నారు. అవకాశం దొరికన ప్రతిచోట ఈ పథకం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.
వాస్తవానికి దేశంలో లింగ నిష్పత్తిలో సమతుల్యత ఉన్న రాష్ట్రం కేరళ. ఆ తర్వాత పుదుచ్ఛేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కానీ నిటి అయోగ్ నివేదిక ప్రకారం ఒక్క లఢక్‌లో మాత్రమే బాలుర కంటే బాలిక సంఖ్య అధికంగా ఉంది. అలాగే పథకం కింద కేటాయించిన నిధులు ఎక్కడా పూర్తి స్థాయిలో ఉపయోగించడం లేదు. ఉదాహరణకు లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న హర్యానాలో చూస్తే రూ.249.84లక్షలు కేటాయిస్తే రూ. 142.26 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అంటే నిధుల ఉపయోగం ఏ మేరకు ఉందో దీన్ని బట్టి తేలిపోయింది.
గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని గొప్పగా చెప్పుకుంటున్న తన రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2012-14లో ఆ రాష్ట్రంలో 1000 బాలురకు గాను 907మంది బాలికలు ఉంటే 2015 నాటికి ఆ సంఖ్య 854కు పడిపోయింది. లింగ వ్యత్యాసంలో గుజరాత్ దేశంలోనే మూడవ స్థానంలో ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ప్రధాని సొంత రాష్ట్రంలోనే అమ్మాయిల పుట్టుక పట్ల ఇంతటి వివక్ష ఉంటే ఇక దేశం పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఈ లెక్కలన్నింటినీ మరుగునపెట్టి బేటీ బచావో… బేడీ పఢావో అద్భుత ఫలితాల నిస్తుందంటూ పచ్చి అబద్ధాలు చెప్పడం మన పాలకులకే చెల్లింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు నిండినా ఆడపిల్ల పుడితే భారంగా, అరిష్టంగా భావిస్తున్న దేశం మనది. పేదరికం కూడా దీనికి తోడవుతున్నది. అందుకే కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలిస్తే పిండాన్ని విచ్ఛిన్నం చేసే దుర్మార్గం మన దగ్గర యధేచ్ఛగా సాగుతూనే ఉంది. డబ్బుకు ఆశపడి స్కానింగ్‌లు చేస్తున్న డయగ్నాస్టిక్ సెంటర్లకు, అబార్షన్లు చేస్తున్న వైద్యులకైతే కొదవే లేదు. వీటిని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయన్నది తాజా లెక్కలు చెబుతున్నాయి.
దేశంలో అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోవడానికి తరతరాలుగా కొనసాగుతున్న లింగ వివక్ష ఓ ప్రధాన కారణం. ఈ వివక్ష ఇటీవల కాలంలో మరింత పెరిగిపోతున్నది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న బీజేపీ నాయకుల గురించి రోజూ వింటూనే ఉన్నాం. కాపాడాల్సిన వారే అకృత్యాలకు పాల్పడు తున్నారు. మహిళల పట్ల చులకన భావం పెరిగిపోయింది. ఈ భావన మత ఛాందసం నుండి పుట్టిందే. మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తెచ్చి మహిళల పరిస్థితిని మరింత దిగజార్చు తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళలు అభద్రతా భావంలో జీవిస్తున్నారన్నది పచ్చి నిజం. ప్రభుత్వ లెక్కలే ఈ విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నాయి.
రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా రక్షణ విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నోరు విప్పి మాట్లాడటం లేదు. మనుధర్మం పాలిస్తున్న చోట, మత ఛాందసం రాజ్యమేలుతున్న చోట అమ్మాయిల రక్షణ కోరుకోవడం మన అత్యాశే అవుతుంది. అయితే ఈ మత ఛాందసం ఇలాగే పెచ్చరిల్లితే భవిష్యత్‌లో లింగ నిష్పత్తి మరింత పడిపోవడం ఖాయం. అందుకే ఈ మత ఛాందసుల భారి నుండి మన ఆడ బిడ్డలను కాపాడుకుందాం. తద్వారా మన దేశాన్ని, ఈ సృష్టిని నిలబెట్టుకుందాం.